ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అచేతనంగా కన్నబిడ్డ.. కంటికి రెప్పలా సాకుతున్న తల్లిదండ్రులు - యువకునికి అందని ఫింఛను వార్తలు

23 ఏళ్లుగా అచేతనం..! ఎన్ని చికిత్సలు చేయించినా నిష్ఫలం..! ఇంటి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం..! ఇన్ని ప్రతికూలతల మధ్య కూడా తమ కుమారుడిని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు.. ఆ తల్లిదండ్రులు. స్థిర నివాసం లేక ఇబ్బందులు పడుతున్న వారిని.. 3 నెలలుగా కుమారుడి పింఛన్ అందకపోవడం మరిన్ని కష్టాల్లోకి నెట్టింది. కష్టాల కడలిని భారంగా ఈదుతున్న తల్లిదండ్రుల దీనగాథ ఇది.

boy suffering with disease gets no pension and face problems for medication
అచేతనంగా కన్నబిడ్డ.. కంటికి రెప్పలా సాకుతున్న కన్నవారు

By

Published : Oct 12, 2021, 8:54 PM IST

కుమారుడిని గాజుబొమ్మలా చూసుకుంటున్న తండ్రి ప్రేమ ఇది. చుట్టుముట్టిన కష్టాలను కళ్లల్లో కనపడనివ్వకుండా బిడ్డను సాకుతున్న తల్లి అనురాగం ఇది. ఆ యువకుడికి.. పుట్టిన ఏడు రోజులకే కామెర్ల వ్యాధి సోకింది. వైద్యులు రక్త మార్పిడి చేస్తే కొంతవరకు ఆరోగ్యం మెరుగుపడుతోందని చెప్పారు. అయినా పూర్తిగా స్థాయిలో భరోసా కల్పించలేదు. తల్లిదండ్రులు ధైర్యం చేసి రక్త మార్పిడి చేయించారు. అయినప్పటికీ ఆ యువకుడి ఆరోగ్యంలో ఎలాంటి మార్పులేదు. రోజురోజుకు కుమారుడి ఆరోగ్యం క్షీణిస్తున్నా.. గుండె ధైర్యం చేసుకొని లక్షల రూపాయలు ఖర్చు చేసి వైద్యం చేయిస్తూనే వచ్చారు.

అచేతనంగా పడి ఉన్న యువకుని పేరు.. దాసరి వర్ధన్‌. కృష్ణా జిల్లా విజయవాడ ప్రకాశ్‌నగర్‌లో ఉండే శ్రీనివాసరావు, సుహాసిని పెద్ద కుమారుడు. పుట్టిన వారానికే కామెర్లు కాటేసింది. ఎన్ని చికిత్సలు చేయించినా ప్రయోజనం లేకపోయింది. లక్షలు ధారపోసినా చలనం రాకపోవటంతో.. 23 ఏళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. ఎదురైన ప్రతి ఇబ్బందినీ దాటుకుని మరీ బిడ్డను సాకుతున్న తల్లిదండ్రులకు.. ఏదో రూపంలో విధి వెక్కిరిస్తూనే ఉంది.

ఐదేళ్లుగా ప్రభుత్వం నుంచి పింఛన్ తీసుకుంటూ.. కుమారుడి మందులు, ఇతర ఖర్చులను చూసుకుంటున్నారు. కానీ, మూడు నెలలుగా పింఛన్ రాక అల్లాడిపోతున్నారు. అప్పులు చేస్తే తప్ప వర్ధన్‌కు మందులు కొనలేమని.. ఇంటిని నడపలేమని.. ప్రభుత్వమే స్పందించి ఆదుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

అచేతనంగా కన్నబిడ్డ.. కంటికి రెప్పలా సాకుతున్న కన్నవారు

ఇదీ చదవండి:

KRMB: ఈనెల 14 నుంచి గెజిట్ అమల్లోకి.. కృష్ణా బోర్డు ప్రకటన

ABOUT THE AUTHOR

...view details