రాష్ట్ర గవర్నర్‌కు, శాసనసభకు సలహాలు ఇచ్చే అధికారం ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు లేదని మంత్రి బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు. గవర్నర్‌కు ఎస్ఈసీ లేఖ రాయటంపై స్పందించిన ఆయన... శాసనసభ హక్కుల్ని, సభ్యుల బాధ్యతల్ని ప్రశ్నించే నైతిక హక్కు నిమ్మగడ్డకు లేదన్నారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ప్రభుత్వం పేర్కొంటే.. ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు.
జనవరిలో వ్యాక్సిన్ వస్తుందని.. అంచెలంచలుగా ఆ వ్యాక్సిన్ దేశమంతా సరఫరా చేస్తామని.. అప్పటివరకూ ప్రజలు అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని ఇటీవల ప్రధాని మోదీ చెప్పారని గుర్తుచేశారు. కొవిడ్ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ఎన్నికలు జరిగితే.. ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు ఉండవని అన్నారు.