రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడుగా బొప్పరాజు వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ప్యానల్లోని 23 మంది సహ అధ్యక్షులు, సభ్యులుగా ఎన్నికయ్యారు. ఇవాళ నిర్వహించిన ఎన్నికలో రాష్ట్రంలోని 13 జిల్లాలకు సంబంధించిన రెవెన్యూ ఉద్యోగులు మరే బృందాన్ని బరిలో దించని కారణంగా బొప్పరాజు బృందం దాఖలు చేసిన నామినేషన్లను ఖరారు చేస్తూ ఆయన ప్యానల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు నిర్వాహకులు ప్రకటించారు.
అధ్యక్షుడిగా బొప్పరాజు వెంకటేశ్వర్లు, సహాధ్యక్షుడిగా పితాని త్రినాధరావు ఎన్నికయ్యారు. ఆరుగురు ఉపాధ్యక్షులు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం కార్యదర్శిగా సీహెచ్ కృష్ణమూర్తి ఎన్నికయ్యారు. మరోవైపు రాష్ట్రంలోని రెవెన్యూ ఉద్యోగులపై పనిభారం విపరీతంగా పెరిగిందని.. తగ్గించేందుకు మండలస్థాయిలో, డివిజన్ స్థాయిలో ఉద్యోగుల నియామకాలు చేపట్టాలని రెవెన్యూ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. సీపీఎస్, డీఏ, కాంట్రాక్టు ఉద్యోగుల కొనసాగింపు తదితర డిమాండ్లను పరిష్కరించాలని రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది.