విజయవాడ స్వరాజ్య మైదానంలో వెల్లువిరిసిన అక్షరచైతన్య మహోత్సవం ఘనంగా ముగిసింది. వేలాదిగా తరలివచ్చిన పుస్తక ప్రియులు లక్షల పుస్తకాలను కళ్లారా చూసి మనసారా ఆస్వాదించారు. సంక్రాంతికి ముందు చదువరుల పండుగ.. అన్నివర్గాలు, అన్ని తరగతుల వారిని విశేషంగా ఆకర్షించింది. దేశంలోనే ఓ మోడల్ సొసైటీగా పరిణమించిన విజయవాడ బుక్ సొసైటీ.. 32వ పుస్తక మహోత్సవం ద్వారా అక్షరాల రాశుల్ని అందరి ముందు ఉంచింది. మనుషులను.. మనసులను దగ్గర చేసి.. సజీవమైన జీవన అనుభవాల సారాంశాలతో కూడిన అనేక పుస్తకాలను అందుబాటులోకి తెచ్చింది.
దేశంలోని గుర్తింపు పొందిన ప్రచురణకర్తలందరి ముద్రణలతో.. ఏర్పాటు చేసిన స్టాళ్లలో నిత్యం కొనుగోలుదారుల సందడి కనిపించింది. ఓ వైపు కరోనా భయంతో.. అమ్మకాలు ఎలా ఉంటాయో, సందర్శకులు వస్తారో రారో అనే సందిగ్ధం. కానీ ఈ నెల 1వ తేదీన ప్రారంభమైన పుస్తక మహోత్సవానికి అనూహ్య స్పందన వచ్చింది. ప్రచురణకర్తల్లో ఆనందం తొణికిసలాడింది. కొవిడ్ కారణంగా ఉత్తరాది రాష్ట్రాల ప్రచరణకర్తలు రాకపోయినా.. అమ్మకాలు మాత్రం ఆశాజనకంగా కనిపించాయి. గత 11 రోజుల్లో మొత్తం 6 లక్షల మంది పుస్తక ప్రియులు సందర్శించారు. దాదాపు రూ.5 కోట్ల వ్యాపారం జరిగిందని నిర్వాహకులు వెల్లడించారు.
పుస్తక మహోత్సవం చివరి రోజున ప్రాంగణమంతా మరింత కళకళలాడింది. పుస్తక ప్రదర్శన విజయవంతంగా నడవడం ఆనందంగా ఉందని నిర్వాహకులు, ప్రచురణకర్తలు అన్నారు. పుస్తక, సాహితీ అభిమానులు అధికంగా ఉండే ప్రాంతం విజయవాడ కావడం వల్లే క్లిష్టసమయంలోనూ విజయవంతంగా నడించిందనే అభిప్రాయం వ్యక్తమైంది.