'అర్ధరాత్రి వేళ జీవోల జారీపై సమాధానం చెప్పండి' - రమేష్ నాయుడు తాజా న్యూస్
సీఎం జగన్ విధానాలతో రాష్ట్రం అభివృద్ధిలో వెనక్కి నడుస్తోందని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్ నాయుడు ఆరోపించారు. ప్రజలు నిద్రించే వేళ జీవోలు జారీ చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ వైఖరితో రాష్ట్రంలో పనిలేదని... పక్క రాష్ట్రాల వారు రానిచ్చే పరిస్థితి లేదని ధ్వజమెత్తారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వస్తే పారదర్శక పాలన అందిస్తామని చెప్పిన జగన్... ఇప్పుడు అర్ధరాత్రి జీవోలు ఎందుకు జారీ చేయాల్సి వస్తుందో ప్రజలకు చెప్పాలని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్ నాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం ముందుకు వెళ్తే పడిపోతామేమోనని... ముఖ్యమంత్రి జగన్ వెనక్కి నడుస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఎం వైఖరితో పరిశ్రమలన్నీ పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని ఆరోపించారు. పని కోసం వేరే రాష్ట్రాలకు వెళ్దామన్నా... వారు రానివ్వట్లేదన్నారు. అందుకు కర్ణాటకలో ఏపీ బస్సుపై రాళ్లదాడే ఉదాహరణ అని వివరించారు. ఐటీ సంస్థలు రాష్ట్రానికి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. వాటితోనే అభివృద్ధి సాధ్యమని రమేశ్ నాయుడు అభిప్రాయపడ్డారు.
ఇవీ చూడండి-'అసమర్థ పాలనతో అన్ని రంగాలను నిర్వీర్యం చేశారు'
TAGGED:
రమేష్ నాయుడు తాజా న్యూస్