somu veerraju: అన్నమయ్య ప్రాజెక్టు విషయంలో కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రాష్ట్రంలో జరిగే విషయాలు.. షెకావత్‌కు తెలియదన్న భ్రమలో ప్రభుత్వం ఉందా? అని ప్రశ్నించారు. పొరపాట్లు సరిదిద్దుకోవాలి గానీ విమర్శలు చేయడం సరికాదన్నారు. అన్నమయ్య డ్యామ్‌పై తూతూమంత్రంగా విచారణ కమిషన్ వేశారని సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు కొట్టుకుపోయిన ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పోలవరానికి నిధులివ్వలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న సోము.. రాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేసిన ప్రకారమే నిధులు వస్తాయని స్పష్టం చేశారు.
అన్నమయ్య ప్రాజెక్టు విషయంలో కేంద్ర మంత్రిపై విమర్శలు విడ్డూరంగా ఉంది. అన్నమయ్య డ్యామ్‌పై తూతూమంత్రంగా విచారణ కమిషన్ వేశారు. ప్రాజెక్టు కొట్టుకుపోయిన ఘటనపై న్యాయ విచారణ జరిపించాలి. పోలవరానికి నిధులివ్వలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. - సోము వీర్రాజు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
పీఆర్సీ కోసం ఆందోళన చేస్తున్న ఉద్యోగులకు భాజపా మద్దతు ఉంటుందని సోము వీర్రాజు అన్నారు. ప్రభుత్వం వెంటనే పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ మూసేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు చేస్తోందని సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని డెయిరీలు, చక్కెర మిల్లులను మూసేసిన వైకాపా ప్రభుత్వాన్ని ఏమనాలని ప్రశ్నించారు. పాయకరావుపేట చక్కెర కర్మాగారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే విక్రయానికి సిద్ధం చేసిందని గుర్తు చేశారు. చిత్తూరు, కడప జిల్లాల్లో ఎర్రచందనం అక్రమ రవాణా అధికమైందని అన్నారు.