Somu Veeraju Comments On Amaravati: అమరావతి రైతుల మహాపాదయాత్రకు ప్రతిరోజూ అడ్డంకులు సృష్టించడం రాష్ట్ర ప్రభుత్వానికి తగదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. విజయవాడలో నిర్వహించిన భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఏపీ సర్కార్ తీరుపై మండిపడ్డారు. ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామనే నైతిక హక్కు సీఎం జగన్‌కు లేదని అన్నారు. మహాపాదయాత్రకు తమ పార్టీ పూర్తి మద్దతు ఉందని.. యాత్ర సాఫీగా సాగేలా చూడడాన్ని తమ పార్టీ నైతిక బాధ్యతగా భావిస్తోందన్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతిని కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని.. అందుకే ఈ ప్రాంతానికి చుట్టుపక్కల అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందన్నారు.
పది వేల కోట్లతో అనంతపురం నుంచి రాజధాని అమరావతి వరకు రహదారి నిర్మాణానికి కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ అంగీకరించారని.. త్వరలో రహదారి పనులు ప్రారంభిస్తారన్నారు. ఈనెల 10న విజయవాడలో నిర్మించిన ఫ్లైఓవర్‌ను ప్రారంభించేందుకు గడ్కరీ రానున్నట్లు చెప్పారు. అమరావతి రాజధాని అనే ఆలోచనతో దుర్గ గుడి పైవంతెన ప్రారంభించామని సోము అన్నారు.
మరో రెండు ఫ్లైఓవర్లను ఆరు మాసాల ముందే పూర్తి చేశామని... అమరావతి రాజధాని ప్రాంతం నుంచి కృష్ణా కరకట్టమీద నుంచి ఇబ్రహీంపట్నం వరకు వంతెన నిర్మానం జరుగుతోందని తెలిపారు. అమరావతిలోనే ఎయిమ్స్ ఆసుపత్రితో పాటు ఎంబీబీఎస్ కళాశాల ఏర్పాటు చేశామన్నారు. రూ.1400 కోట్ల నిధులు ఎయిమ్స్‌కు విడుదల చేశామన్నారు.