రాష్ట్ర ప్రభుత్వం అవాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లి... విస్తృత ప్రచార ఆర్భాటంతో కాలం వెళ్లదీస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. విజయవాడలో జరుగుతున్న పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ప్రారంభ ఉపన్యాసం చేసిన వీర్రాజు... ఉద్యోగ కాలెండర్ మొదలు అన్ని విషయాల్లోనూ ప్రభుత్వం విఫలమైందని... ప్రజల ఆకాంక్షలను నెరవేర్చకుండా నిరాశలోకి నెట్టిందని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండున్నర లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని... అధికారంలోకి రాకముందు జగన్మోహనరెడ్డి చేసిన ప్రకటనలకు.. ఇప్పుడు ఆచరణకు పొంతన లేకుండా పోతోందని ధ్వజమెత్తారు.
ఎక్సైజ్ విధానంపై శ్వేతపత్రం విడుదల చేయాలి: సోము
రాష్ట్ర ప్రభుత్వ మద్యం విధానాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. 25 రూపాయల చీప్ లిక్కర్‌ను 300 రూపాయలకు విక్రయిస్తూ సామాన్యుల జేబులకు చిల్లుపెడుతున్నారని ఆరోపించారు. మద్యం బెల్టుషాపులు లేవంటూనే కిల్లీబడ్డీల్లోనూ మద్యం దొరికేలా చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదేనని అన్నారు. మద్యం ఎంత ధరకు కొనుగోలు చేస్తున్నారు? ఎంతకు విక్రయిస్తున్నారు? ఎంత ఆదాయం వస్తోంది? అనే విషయాలపై ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఇసుక అక్రమాలపై ప్రశ్నిస్తే కేసులు పెడతారా?
గనులశాఖ నిద్రావస్థలో ఉందని.... ఇసుక, రెడ్‌గ్రావెల్, కొండలను అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా కొల్లగొడుతున్నా వాటిని నియంత్రించలేకపోతున్నారని ఆరోపించారు. ప్రశ్నించే వారిపై పోలీసులు కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. విశాఖ వంటి నగరాల్లో పది టైర్ల లారీ ఇసుక 25 వేల రూపాయలుగా ఉంటోందని... నిర్దేశించిన మొత్తం కంటే అధిక ధరకు ఇసుక విక్రయిస్తున్నా ప్రభుత్వం ఎందుకు నిద్రపోతోందని ప్రశ్నించారు. వాగులు, వంకలు, పాయల్లోని ఇసుకను అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు అప్పగించారని... ఎమ్మెల్యేలు, వారి అనుయాయుల వీటికి నాయకత్వం వహిస్తున్నారన్నారు. పోలవరం కుడి ప్రధాన కాల్వలోని మట్టిని సైతం దోపిడీ చేశారన్నారు.