పెట్రోల్ ధరలపై రాష్ట్ర ప్రభుత్వం పన్ను తగ్గించాలంటూ.. రాష్ట్రవ్యాప్తంగా భాజపా శ్రేణులు ఆందోళన చేపట్టాయి. కేంద్రం తగ్గించినా.. రాష్ట్రప్రభుత్వం ఇప్పటివరకు స్పందించకపోవటం దారుణమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. రాజమహేంద్రవరం సబ్-కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న ఆయన.. ఈ విషయమై రాబోయే రోజుల్లో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
గుంటూరు కలెక్టరేట్ వద్ద కన్నాలక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో నేతలు నిరసన తెలిపారు. పెట్రోల్‌పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. ధరలు తగ్గించకుండా ప్రజలపై అదనపు భారం మోపుతున్నారని కన్నా మండిపడ్డారు.
ఇంధన ధరలు తగ్గించాలంటూ.. కడప కలెక్టరేట్ ఎదుట భాజపా ధర్నా చేపట్టింది. భాజపా కడప జిల్లా అధ్యక్షుడు ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోదీని ఆదర్శంగా తీసుకుని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇంధన ధరలు తగ్గిస్తే.. సీఎం జగన్ ఇప్పటికీ స్పందించకపోవటం సరైంది కాదన్నారు. ప్రజాసంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.
అనంతపురంలోని టవర్ క్లాక్ వద్ద భాజపా నేతలు ఆందోళన చేపట్టారు. ప్రజలపై పన్నుల భారం మోపటమే లక్ష్యంగా జగన్ పాలన సాగిస్తున్నారని భాజపా నేతలు మండిపడ్డారు. ఇతర రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు తగ్గించినా.. ఏపీలో మాత్రం ప్రజలపై అదనపు భారం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.