రాష్ట్రంలో వర్షాల కారణంగా పంట నష్టం జరిగిన రైతులను ఆదుకోవాలని కేంద్రాన్ని కోరినట్లు భాజపా ఎంపీ సీఎం రమేశ్ తెలిపారు. అన్నదాతలను ఆదుకోవాల్సిందిగా కేంద్రమంత్రి రూపాలాకు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక వస్తే సాయం చేస్తామని కేంద్రమంత్రి చెప్పిన్నట్లు సీఎం రమేశ్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పంట నష్టంపై అంచనా వేసి కేంద్రానికి నివేదిక పంపాలని అన్నారు.
పంట చేతికందే సమయానికి రాష్ట్రంలో వర్షాలు కురిసి రైతులు తీవ్రంగా నష్టపోయారని సీఎం రమేశ్ అన్నారు. పత్తి, శనగపంట అంతా నీటిపాలైందన్నారు. పంట నష్టంపై రాష్ట్రం కేంద్రానికి లేఖ రాసి వదిలేసిందని విమర్శించారు. ఎంత పంట నష్టం జరిగిందో అంచనా వేయలేదన్నారు. రైతులకు ఎక్కడా ఎరువులు గానీ, పనిముట్లు గానీ ఇవ్వలేదని మండిపడ్డారు. వర్షాలకు తడిసిన ధాన్యాన్ని రాష్ట్రప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలన్నారు.