ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖ ఉక్కు విషయం చాలా సున్నితమైనది: సోము వీర్రాజు - somu veerraju recent news

విశాఖ ఉక్కు పరిశ్రమపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. ఓ ట్వీట్‌ ను ఆధారంగా చేసుకుని ఆందోళనలు చేయడం సరికాదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు తెలిపారు. మూడు రోజుల దిల్లీ పర్యటనలో వివిధ అంశాలపై.. పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రులను కలిసి వారితో చర్చించామని... పలు వ్యవహారాల్లో ఫిర్యాదులు చేశామని తెలిపారు.

somu verraju
సోము వీర్రాజు

By

Published : Feb 19, 2021, 2:56 PM IST

విశాఖ ఉక్కు పరిశ్రమ విషయం చాలా సున్నితమైందని... కార్మికుల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు భాజపా వ్యతిరేక పార్టీలు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఉక్కు ఉద్యోగుల భద్రత, పరిశ్రమ రెండు అంశాలు కేంద్రానికి అతి ముఖ్యమైనవని.. ఈ పరిశ్రమను రక్షిస్తామని స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వం అంతిమ నిర్ణయం ఏదీ తీసుకోలేదని.. సంబంధిత మంత్రి ఎలాంటి ప్రకటన చేయలేదని.. ఎలాంటి నోటిఫికేషన్‌ జారీ కాలేదని... ఓ ట్వీట్‌ను ఆధారంగా చేసుకుని ఉద్యమిస్తామని అనడం సరికాదని అన్నారు. పోరాటం, త్యాగాల ఫలితమైన విశాఖ పరిశ్రమ రక్షణ, ఉద్యోగుల భద్రతపై ప్రత్యామ్నాయాలను తాము కేంద్రానికి ప్రతిపాదించామని... అభద్రతా భావాన్ని కలుగజేసే అవాస్తవ ప్రచారాలను ఉద్యోగులు, కార్మికులు నమ్మొద్దని హితవు పలికారు.

రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులు, బలవంతపు మతమార్పిడిలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యల నుంచి దృష్టి మళ్లించేందుకు.. విశాఖ ఉక్కు ఉద్యమాన్ని తెరమీదకు తీసుకొచ్చారని ఆరోపించారు. గత 20 నెలలకు నుంచి రాష్ట్రంలో దేవాలయాలపై వరుసదాడుల వెనుక ప్రత్యక్షంగా, పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వ మద్దతు ఉందని పునరుద్ఘాటించారు.

దాడులపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఆదేశించినా అది కంటితుడుపు చర్య తప్ప.. ఇంతవరకు బాధ్యులు ఎవరనేది ఎందుకు తేల్చలేదని ధ్వజమెత్తారు. ఏ ప్రక్రియను అయినా కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా చేస్తుందని... పారదర్శకంగా విషయాలను వెల్లడిస్తుందని చెప్పారు. లేని దానికి ఉద్యమం పేరిట ఉద్యోగుల్లో అసహనం.. అభద్రతా భావాన్ని కలిగించొద్దని.. రాజకీయ క్రీడలో విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మికులు, ఉద్యోగులు పడొద్దని కోరారు. మున్సిపల్‌ ఎన్నికలు ముగిసిన తర్వాత కపిలతీర్థం నుంచి రామతీర్థం వరకు రథయాత్ర చేపడతామని... అన్ని విషయాలను ఆ యాత్రలో ప్రజల ముందుకు తీసుకెళ్తామని అన్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో ప్రతి అభివృద్ధి.. కేంద్రం చేస్తున్నదే: సోము వీర్రాజు

ABOUT THE AUTHOR

...view details