BJP Leaders on AP New Cabinet: అవినీతిలో కూరుకున్న వారిని కొత్త కేబినెట్‌లోకి తీసుకున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఆరోపించారు. జగన్ కేబినెట్‌లో మంత్రులకు పవర్ ఉందా? జగన్.. బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వగలరా..? అని ప్రశ్నించారు. టీడీఆర్ కుంభకోణంలో ఉన్న కారుమూరికి మంత్రి పదవి ఇచ్చారన్నారు. ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంవల్లే రాష్ట్రంలో విద్యుత్ కొరత ఏర్పడిందని అన్నారు.
వైకాపా పతన దిశగా వెళ్తోంది :రాష్ట్రంలో వైకాపా పతన దిశగా వెళ్తోందనడానికి తాజా పరిణామాలే నిదర్శనమని భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. మంత్రివర్గ ఏర్పాటులో ప్రభుత్వం పాటించిన మార్గదర్శకాలు ఏమిటో అర్ధం కావడం లేదన్నారు. తొలగించిన వారిని ఏ ప్రాతిపదికగా తీసేశారనే ప్రశ్నకు ముఖ్యమంత్రి స్వయంగా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు.