గుంటూరు జిల్లా తాడేపల్లిలోని డీజీపీ కార్యాలయ ముట్టడికి భాజపా పిలుపునివ్వడంపై పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, సీనియర్ నేతలు విష్ణువర్ధన్‌రెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ , పాతూరి ఇళ్ల వద్ద పికెటింగ్ ఏర్పాటు చేశారు. మరోవైపు.. ఎంపీ రమేశ్‌ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చలో డీజీపీ కార్యాలయానికి అనుమతి లేదని నోటీసులు ఇచ్చారు.
'విగ్రహాల ధ్వంసానికి కారకులు ఎవరు?'
ప్రభుత్వ అండదండలతోనే విగ్రహాల ధ్వంసం జరుగుతున్నాయని భాజపా సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజాస్వామ్యం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థ అధికార పార్టీ చెప్పినట్లు నడుచుకోవటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు. విగ్రహాల ధ్వంసానికి కారకులు ఎవరో ప్రభుత్వం వారం లోగా చెప్పాలని డిమాండ్ చేశారు.