ఏపీలో కాషాయ ముఖ్యమంత్రి వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను భాజపా నేతలు తీవ్రంగా ఖండించారు. వైకాపా ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం తమకు లేదని భాజపా రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్ఛార్జ్ సునీల్ దేవధర్ స్పష్టం చేశారు. ఆ ఆలోచన కూడా మా పార్టీకి లేదని సునీల్ దేవధర్ తేల్చి చెప్పారు. ఏ క్షణంలో బెయిల్ రద్దు అవుతుందో తెలియక, రోజు గడవడానికి అప్పుపుట్టక.. రాష్ట్ర ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టారని ఎద్దేవా చేశారు. దీనికితోడు వేలకోట్ల అవినీతి చేసి మీ ప్రభుత్వానికి మీరే పాతాళమంత లోతు గొయ్యి తవ్వి తవ్వుకున్నారని పేర్ని నాని వ్యాఖ్యలపై ఘాటుగా ట్వీట్ చేశారు.
మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు భయంతో చేసినవేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. ఏపీ అభివృద్ధి కోసమే కమలం పార్టీ పని చేస్తోందని స్పష్టం చేశారు. విజయవాడలో నిర్వహించిన ఆరోగ్య స్వయం సేవక్ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. మూడో దశ కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు వీలుగా ఈ శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. తమది కుటుంబపాలన పార్టీ కాదన్న సోము వీర్రాజు.. రాజకీయాల్లో సమాజసేవే ప్రథమ లక్ష్యంగా భాజపా పని చేస్తుందన్నారు.
మరోవైపు ఏపీలో జనహితం కోసం తమ పార్టీ పని చేస్తుంటే.. కుటుంబ పార్టీలైన వైకాపా, తెదేపాలు రాజకీయాల కోసం ప్రయత్నిస్తున్నాయని భాజపా విజయవాడ సిటీ అధ్యక్షుడు రవి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రెండు లక్షల కోట్లతో నిర్మిస్తున్న జాతీయ రహదారుల ప్రాజెక్టులు కేంద్ర నిధులు కాదా అంటూ ప్రశ్నించారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రం పాలకులు ఇక్కడోమాట, దిల్లీలో మరోమాట మాట్లాడుతున్నారని ఆరోపించారు.
ఖాదీ వస్త్రాలను కొనుగోలు చేసిన సోము వీర్రాజు...