దేశంలో కొవిడ్ బాధితులకు పెద్ద మొత్తంలో ఆక్సిజన్ అవసరమున్న ప్రస్తుత తరుణంలో.. దేశవ్యాప్తంగా నిరంతర ఆక్సిజన్ సరఫరాలో భారతీయ రైల్వే విలక్షణమైన పాత్రను పోషిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అభినందించారు. ఇప్పటివరకు 334 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడిపి.. 1,357 ట్యాంకర్లలో 22,916 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ చేసిందన్నారు.
వీటిలో ఆంధ్రప్రదేశ్ ఒక్కదానికే.. 2,125 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేసి ఎంతోమంది ప్రాణాలు కాపాడడంలో తనవంతు పాత్రను పోషించిందన్నారు. ఈ ప్రక్రియను ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్న రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్, అందుకు సహకరించిన రైల్వే శాఖలోని సిబ్బందికి సోము వీర్రాజు ధన్యవాదాలు తెలిపారు.