JP Nadda on YSRCP: దేశాన్ని సురక్షితంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను భాజపా కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపునిచ్చారు. ఏపీ పర్యటనలో భాగంగా విజయవాడలో నిర్వహించిన భాజపా శక్తి కేంద్ర ప్రముఖుల సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో 46వేలకు పైగా పోలింగ్ బూత్‌లు ఉన్నాయని.. బూత్‌ల వారీగా ప్రజల వద్దకు పార్టీని తీసుకెళ్లాల్సిన బాధ్యత శక్తి కేంద్ర ప్రముఖులపై ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ మాయమాటలు ప్రజలకు వివరించాలని ఈ సందర్బంగా సూచించారు.
బూత్ కమిటీల్లో అన్ని వర్గాలకు ప్రాధాన్యమివ్వాలి..:భాజపా కార్యకర్తలతో బూత్ కమిటీలను ఏర్పాటు చేయాలని.. కొత్త వారిని పార్టీలో చేర్చుకునే అంశంపై దృష్టి సారించాలని నడ్డా సూచించారు. బూత్ కమిటీల్లో అన్ని వర్గాల భాగస్వామ్యం ఉండేలా చూసుకోవాలన్నారు. భాజపా అన్ని వర్గాల పార్టీ అనే భావన వచ్చేలా పని చేయాల్సిన బాధ్యత శక్తి కేంద్ర ప్రముఖులపై ఉంటుందని చెప్పారు. ‘ఆయుష్మాన్ భారత్’ పేరుతో బృహత్తర ఆరోగ్య పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. దాన్నే ‘ఆరోగ్యశ్రీ’ పేరుతో జగన్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని చెప్పారు. అది జగన్ స్కీం కాదని.. నరేంద్ర మోదీదని నడ్డా వ్యాఖ్యానించారు. ఆయుష్మాన్ భారత్ పథకంతో రూ.5లక్షల వరకు వైద్యసాయం అందుతున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని శ్రేణులకు నడ్డా సూచించారు. ఆయుష్మాన్ భారత్ ఎక్కడైనా పని చేస్తుందని.. రాష్ట్రం దాటితే ఆరోగ్యశ్రీ పనికిరాదని వ్యాఖ్యానించారు. పీఎం కిసాన్ కింద ఏటా రూ.6వేలు రైతుల ఖాతాల్లో వేస్తున్నామని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచారు.. కరెంటు కోతలు విధిస్తున్నారని మండిపడ్డారు. రైతులకు మోదీ చేస్తున్న సాయాన్ని.. జగన్ సొంత పథకంగా చెబుతున్నారని మండిపడ్డారు.