రాష్ట్రంలో... కులతత్వం, కుటుంబ పాలన, అవినీతితో కూడిన వ్యవస్థల ప్రక్షాళనే లక్ష్యంగా పొత్తు పెట్టుకున్నట్లు భాజపా, జనసేన స్పష్టంచేశాయి. విజయవాడలో జరిగిన ముఖ్యనాయకుల సమావేశంలో సుమారు 3గంటలపాటు.. రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. 3 రాజధానుల ప్రకటన, అమరావతి నుంచి రాజధాని తరలింపు, పోలవరం పనులకు ఆటంకాలు వంటి కీలక అంశాలపై ముచ్చటించారు. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి అనుసరించాల్సిన విధానాలపైనా.. సమాలోచనలు జరిపారు.
స్థానిక సమరం నుంచి సార్వత్రిక ఎన్నికల వరకూ కలిసి పనిచేసే అంశాలపై భాజపా, జనసేన నేతలు చర్చించారు. ప్రజల ఆకాంక్షలను వైకాపా ప్రభుత్వం నీరుగారుస్తుంటే తెలుగుదేశం బలంగా నిలబడలేకపోతోందన్న పవన్.. ఆ కర్తవ్యాన్ని స్వీకరిచేందుకు ఎలాంటి షరతుల్లేకుండా కలసి ముందుకు వెళ్తామని ప్రకటించారు.
సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు, అభిప్రాయాలను ఇరుపార్టీల నేతలు నోట్ చేశారు. గతంలో భాజపాను ఎందుకు విమర్శించారో జనసేన నేతలు చెప్పారు. హోదా విషయంలో మాత్రమే భాజపాను తప్పుపట్టానని పవన్ గుర్తుచేశారు. ఈ సమయంలో ఐదేళ్లలో రాష్ట్రానికి కేంద్రం చేసిన సాయంపై భాజపా నేతలు ఇచ్చిన వివరణతో పవన్ సంతృప్తి చెందినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో... తెదేపాతో జనసేన కలిసి వెళ్లకూడదనే అంశంపైనా చర్చ జరిగింది. భాజపా నేతలు కూడా వైకాపాతో భవిష్యత్తులోనూ దూరంగా ఉంటామని స్పష్టం చేశారు. ప్రజాసమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు, ఆందోళనలకు ఉమ్మడిగా ఉద్యమించాలనే అభిప్రాయానికి వచ్చారు. ఇందుకోసం సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకుని.. నెలకు 2 సార్లు సమావేశవ్వాలని నిర్ణయించారు.
అమరావతి రాజధాని తరలింపుపై భాజపా ప్రత్యేక పోరాట కార్యాచరణను.. మూడు, నాలుగు రోజుల్లో సిద్ధం చేయబోతోంది. కవాతు నిర్వహించాలా? సభ ఏర్పాటు చేయాలా? అనే అంశంపై తుది నిర్ణయం తీసుకోవాలని నేతలు భావిస్తున్నారు. వైకాపా సర్కార్ నియంతృత్వ పోకడలతో ముందుకెళ్తే రోడ్డెక్కి పోరాటం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు.
భాజపా, జనసేన పొత్తు పొడిచింది ఇదీ చదవండి: 'కలిసి పనిచేద్దాం'...భాజపా-జనసేన ఉమ్మడి ప్రకటన