BJP demands CBI inquiry into Lepakshi lands scam: లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూదోపిడీపై సీబీఐ విచారణకు భాజపా డిమాండ్ చేసింది. సీబీఐ దర్యాప్తు చేస్తే జగన్ పునాదులు కదలడం ఖాయమని భాజపా నేతలన్నారు. దాదాపు 4 వేల 200 ఎకరాల భూములు కేవలం రూ.500 కోట్లకు కట్టబెట్టడం అతిపెద్ద స్కామ్‌గా భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు, విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.
లేపాక్షి నాలెడ్జ్ హబ్ కుంభకోణం నేపథ్యమిదీ..: వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అస్మదీయుల కంపెనీ అయిన ఇందూ గ్రూపునకు అనంతపురం జిల్లాలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరుతో కారుచౌకగా అత్యంత విలువైన భూములను కట్టబెట్టారు. అందుకు నజరానాగా ఆ కంపెనీ వైఎస్ జగన్ ఏర్పాటు చేసిన సంస్థలో పెట్టుబడులు పెట్టింది. సీబీఐ విచారణలో ఈ కుంభకోణం వెలుగు చూడటంతో ఆ భూముల్ని ఈడీ జప్తు చేసింది. అప్పటికే వాటిని తనఖా పెట్టి తీసుకున్న వేల కోట్ల రుణాల్ని తిరిగి చెల్లించలేదు. ప్రస్తుత మార్కెట్ ప్రకారం రూ.వేల కోట్ల విలువైన ఆ భూములు.. దివాలా ప్రక్రియ రూపంలో తాజాగా మళ్లీ జగన్ దగ్గరి బంధువుల కంపెనీ చేతికే దక్కుతున్నాయి. అదీ అత్యంత చౌకగా.. కేవలం రూ.500 కోట్లకే దక్కనున్నాయి.