BJP News: ప్రధాని మోదీ పాలనలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. 'ఇప్పుడు భారత్ అంటే.. ప్రపంచం నుంచి తీసుకునేది కాదు.. ప్రపంచానికి ఇచ్చేది' అని నడ్డా అన్నారు. అన్ని మతాల పుణ్యక్షేత్రాలనూ భాజపా ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందన్నారు. ఐదుగురు మహనీయుల స్మారకాలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ప్రధాన మోదీతోనే దేశ అభివృద్ధి సాధ్యమని నడ్డా స్పష్టం చేశారు. రెండు రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా ఇవాళ విజయవాడకు చేరుకున్న నడ్డా.. వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఇప్పుడు భారత్ అంటే.. ప్రపంచం నుంచి తీసుకునేది కాదు, ఇచ్చేది. రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులతో చర్చించి 23 వేల మంది పౌరులను క్షేమంగా భారత్‌కు తీసుకొచ్చాం. ఉక్రెయిన్ నుంచి క్షేమంగా బయటపడేందుకు ఇతర దేశస్థులు భారత జెండాలు పట్టుకున్నారు. ప్రధాని మోదీకి ప్రపంచవ్యాప్తంగా దక్కుతున్న గౌరవానికి ఇదే నిదర్శనం. స్మాల్‌పాక్స్, చికెన్‌పాక్స్‌కు ఔషధాల ఆవిష్కరణకు 20 ఏళ్లు పట్టింది. పోలియోకు ఔషధం కనిపెట్టేందుకు 30 ఏళ్లు పట్టింది. కానీ.. కొవిడ్ టీకా మాత్రం ఏడాదిలో తీసుకురాగలిగాం. 200 కోట్ల టీకాలు వేగంగా పంపిణీ చేసిన దేశంగా రికార్డు సృష్టించనున్నాం. గత 8 ఏళ్లల్లో ఈశాన్య రాష్ట్రాల్లో మోదీ 50 సార్లు పర్యటించారు. ఏ ప్రధాని కూడా ఈశాన్య రాష్ట్రాల్లో ఇన్నిసార్లు పర్యటించలేదు. - జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు
BJP Core Committee Meeting at Vijayawada:ఏపీ పర్యటనలో ఉన్న జేపీ నడ్డాతో భాజపా రాష్ట్ర నేతల కోర్ కమిటీ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పొత్తుల అంశంతోపాటు పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ పొత్తులపై రాష్ట్ర నేతలు మాట్లాడవద్దని సూచించారు. ఇతర పార్టీలకు దూరం అనే వ్యాఖ్యలు చేయకూడదని స్పష్టం చేశారు. పొత్తులపై మాట్లాడొద్దని అమిత్ షా చెప్పాకా ఆ ప్రస్తావన ఎందుకు వస్తోందనని ప్రశ్నించారు. పవన్ ఆప్షన్లపై పెద్దగా స్పందిచాల్సిన అవసరం లేదన్నారు. సీఎం అభ్యర్థిగా జనసేన నేతల డిమాండ్‌లపై స్పందించాల్సిన అవసరం లేదని నడ్డా సూచించారు. పవన్ తన ఆలోచనలు ఎప్పటికప్పుడు పంచుకుంటున్నారని నడ్డా తెలిపారు. ఎన్నికల సమయంలో ఏ పార్టీతో ఎలా వ్యవహరించాలనేది హైకమాండ్ పరిధిలోని అంశమని పేర్కొన్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా నేతలకు సూచించారు. రాష్ట్రంపై భాజపాకు దృష్టి ఉందని, పక్కా ప్రణాళిక ఉందని తెలిపారు. ఏపీని ఎలా డీల్ చేయాలో తెలియదనుకుంటున్నారా? అని నేతలను నడ్డా ప్రశ్నించినట్లు సమాచారం.