జనసేన, భారతీయ జనతా పార్టీల పొత్తు ఖరారయ్యాకు తొలిసారిగా ఎన్నికల బరిలోకి కలిసి దిగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి వ్యూహం సిద్ధం చేసుకుంటున్నాయి . అధికార పార్టీ తప్పులనే తమ అజెండాగా ముందుకెళ్లాలని నిర్ణయానికి వచ్చాయి. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీచేయాలి, ఎవరికి ఎక్కడ ఎంత బలం ఉందనే అంశంతో పాటు కొన్ని స్థానాల విషయంలో సర్దుబాటు ధోరణిలో వెళ్లాలనే అభిప్రాయానికి వచ్చారు. సమయం తక్కువగా ఉన్నందున త్వరగా ఎలా నిర్ణయాలు తీసుకోవాలనే విషయంపై చర్చ జరిగింది. ప్రభుత్వం కావాలనే తక్కువ సమయం ఇచ్చి ఎన్నికలు నిర్వహిస్తోందని అభిప్రాయపడ్డారు.
సమన్వయ కమిటీలు ఏర్పాటు
ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో 2 పార్టీల ఇన్‌ఛార్జుల ఆధ్వర్యంలో సమన్వయ కమిటీలు ఏర్పాటుకు నిర్ణయించారు. శాసనసభ నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జుల నుంచి పేర్ల ప్రతిపాదన తీసుకుని 2 పార్టీలు స్థానికంగానే నిర్ణయించుకుని ఎవరు పోటీ చేయాలనేది అక్కడికక్కడే ఖరారు చేసేయాలని నిర్ణయించారు. ఆయా పార్టీల బీ ఫాంలు జిల్లా స్థాయిలోనే అభ్యర్థులకు తక్షణమే అందజేసే ఏర్పాట్లు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గ, మండలస్థాయి నుంచి సమన్వయం ఉండేలా చూసుకోవాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. మార్చి 12న ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు.