కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్న తరువాత జనసేన- భాజపా విజయవాడలో ఉభయ పార్టీల తొలి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావడంపై ఈ సమావేశంలో చర్చించారు. భాజపా–జనసేన పార్టీలు కలిసే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని నిశ్చయించుకున్నాయి. దీని కోసం క్షేత్రస్థాయిలో కమిటీలు నియమించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. రెండు పార్టీల అధ్యక్షులు ఆమోదం తెలిపిన తరవాత కమిటీ సభ్యులను ఎంపిక చేయనున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాజపా- జనసేన కలిసే పోటీ - ఏపీ లోకల్ ఎలక్షన్స్- 2020
రాజధాని విషయంలో కలిసే పోరాటం చేయాలని ఇటీవల నిర్ణయించిన జనసేన- భాజపా... మరో కీలక నిర్ణయం తీసుకున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కలిసే పోటీ చేయాలని నిశ్చయించాయి.
అమరావతి రాజధాని విషయంలో రెండు పార్టీలు కలిసి పోరాటం చేయాలని సంకల్పించాయి. ప్రస్తుతం రాజధాని పరిస్థితి ఇలా అయ్యేందుకు నాడు అధికారంలో ఉన్న తెదేపా, నేడు అధికారంలో ఉన్న వైకాపాలు కారణమని సమన్వయ కమిటీ అభిప్రాయపడింది. రాజధాని మార్పు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి చెప్పి చేస్తున్నామని వైకాపా తప్పుడు ప్రచారం చేస్తోందని, ఇలాంటి అబద్ధాలు, అభూత కల్పనల్లో తెదేపా, వైకాపాలు ఒకే రీతిన వ్యవహరిస్తున్నాయని కమిటీ విమర్శించింది. ఈ సమావేశానికి భాజపా నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి, సోము వీర్రాజు, శాంతారెడ్డి... జనసేన పక్షాన నాదెండ్ల మనోహర్, టి.శివశంకర్, కందుల దుర్గేష్, సిహెచ్.మధుసూదన్ రెడ్డి, వి.గంగులయ్య, బి.శ్రీనివాస్ యాదవ్, బి.నాయకర్, సి.మనుక్రాంత్ రెడ్డి హాజరయ్యారు.
ఇదీ చదవండి:ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. కువైట్లో చిక్కుకున్న మహిళలకు విముక్తి