"గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేటు వ్యక్తులకు ఉద్దేశపూర్వకంగా అందజేశారు. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలోనే ఈ డేటా చౌర్యం జరిగింది" అని సభా సంఘం అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి వెల్లడించారు. పెగాసస్ సాఫ్ట్‌వేర్, రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచార చౌర్యం, ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాలపై ఏర్పాటైన ఈ సంఘం భూమన అధ్యక్షతన బుధవారం శాసనసభ కమిటీ హాలులో సమావేశమైంది. సంఘ సభ్యులు కొఠారు అబ్బయ్య చౌదరి, మొండితోక జగన్మోహన్‌రావు, మద్దాలి గిరిధర్, ఐటీ, హోంశాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
"గత ప్రభుత్వ హయాంలో సాధికారిక సర్వేలో సేకరించిన ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వ అనుకూల వ్యక్తులకు ఇచ్చారు. వారు సేవామిత్ర యాప్ ద్వారా తమకు (తెదేపాకు) అనుకూలురు, వ్యతిరేకులెవరో గుర్తించారు. వ్యతిరేకమనుకునే సుమారు 35 లక్షల నుంచి 40 లక్షల మంది పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించేందుకు కుట్ర చేశారు. పేర్లను తొలగించడంద్వారా మళ్లీ వారే అధికారంలోకి రావాలనుకున్నారు. మా సంఘం దీనిపై 4 రోజులపాటు లోతైన విచారణ జరిపింది. నూటికి నూరు శాతం డేటా చౌర్యం జరిగిందని నిర్ధారించింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మా నివేదికను సభ ముందుంచుతాం. నాటి ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి విజయానంద్, ఆర్టీజీఎస్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అహ్మద్‌బాబు, ఇతర అధికారులను విచారించాం. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని కాపాడాల్సిన బాధ్యతలో ఉన్న నాటి ఉద్యోగులనూ పిలిచి విచారిస్తాం. డేటా చౌర్యం జరిగిందని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న మా పార్టీ (వైకాపా) నాయకులు కనిపెట్టి గట్టిగా ప్రతిఘటించడంవల్లే ఓటరు జాబితాలో పేర్ల తొలగింపు చర్యను ఆపగలిగాం. సభా సంఘంగా మాకున్న పరిమితుల మేరకే మేం పని చేస్తాం. దీనిపై పోలీసుల సమగ్ర విచారణ జరగాల్సి ఉంది" -భూమన కరుణాకరరెడ్డి, సభా సంఘం అధ్యక్షుడు