రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. భోగభాగ్యాల భోగికి మంటలతో ప్రజలు సాదర స్వాగతం పలికారు. రాష్ట్రవ్యాప్తంగా తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భోగిమంటలు వేశారు. కోలాటాలు ఆడుతూ భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిలో ఘనంగా భోగి వేడుకలు నిర్వహించారు. ఆలయ ఈవో భ్రమరాంబ భోగి మంటలు వేసి పూజలు చేశారు. ఆలయాన్ని వివిధ పుష్పాలతో అలంకరించారు. శ్రీశైలంలోనూ సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయం ఎదురుగా శాస్త్రోక్తంగా భోగి మంటలు వేసి పూజలు చేశారు. ఇవాళ సాయంత్రం రావణ వాహనంపై స్వామి, అమ్మవార్లు దర్శనమివ్వనున్నారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు.
రంగవల్లుల పోటీలు...
విజయనగరం జిల్లాలో వేకువ జామున భోగిమంటతో పండుగ సంబరాలను ప్రారంభించారు. సంక్రాంతి సంబరాల్లో ప్రత్యేక రంగవల్లులు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దు విన్యాసాలు, జంగమ దేవరల మేలుకొలుపు పాటలు ఆకట్టుకున్నాయి. విజయనగరంలోని ఆనంద గజపతి ఆడిటోరియం ఆవరణలో విజయనగరం వాజీ ఛానల్ ఆధ్వర్యంలో మహిళలకు రంగవల్లుల పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పల్లె వాతావరణం, తెలుగు సంస్క్రతి సంప్రదాయాలు, సంక్రాతి సంబరాలు, జాతీ సమైక్యత, జిల్లా చరిత్రను తెలియచేసేలా మహిళలు విభిన్న ఆకృతులు, రంగుల్లో ముగ్గులను తీర్చిదిద్దారు.
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు...
శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం కాపుతెంబూరులో భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ యువత భోగి మంటను ముట్టించి సంబరాలు చేసుకున్నారు. ప్రకాశం జిల్లా చీరాలలోని వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ ఇంజినీరింగ్ కళాశాలలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ వస్త్రాలు ధరించిన విద్యార్థినులు ప్రదర్శించిన కోలాటాలు, కూచిపూడి నృత్యాలు అలరించాయి. పర్చూరు మండలం అన్నంబోట్లవారిపాలెంలో పొట్టేళ్ల పోటీలు ఉత్సాహంగా జరిగాయి. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో మీనాక్షి పౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కృష్ణాజిల్లా గుడివాడలో భోగి సంబరాలు ఘనంగా నిర్వహించారు.
ఆనందోత్సహాలతో పండగ సంబరాలు టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ...
మరోవైపు సంక్రాంతి పండగకు కోడిపందాలు జరగకుండా.. పోలీసులు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల కోడి పందాల కోసం ఏర్పాటు చేసిన బరులను పోలీసులు ధ్వంసం చేశారు. కృష్ణా జిల్లా నందివాడ మండలంలో కోడి పందాల నిర్వహణకు సిద్ధం చేసిన బారికేడ్లను తొలగించారు. సంక్రాంతి పండగ సెలవులతో ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు సొంతూళ్లకు వరస కట్టడంతో టోల్ ప్లాజాల వద్ద భారీగా వాహనాల రద్దీ పెరిగింది. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు.
ఆనందోత్సహాలతో పండగ సంబరాలు వేడుకల్లో పాల్గొన్న నేతలు, మంత్రులు...
సంక్రాంతి పండుగ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని మంత్రి పేర్నినాని అన్నారు. భోగి పండుగ సందర్భంగా మంత్రి మచిలీపట్నంలోని తన నివాసంలో భోగిమంటలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. తెలుగు ప్రజలందరికీ ఆయన పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ భోగి మంటను వెలిగించారు. ప్రకాశం జిల్లా కారంచేడులో నందమూరి బాలకృష్ణ భోగి వేడుకల్లో పాల్గొన్నారు. కడప జిల్లా శెట్టిపల్లిలో నగిరి ఎమ్మెల్యే రోజా కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి భోగి పండుగను జరుపుకున్నారు.
అనుబంధ కథనాలు..