దశాబ్ద కాలం తర్వాత కృష్ణమ్మ ఉగ్రరూపాన్ని చూసిన భవానీ ద్వీపం...ఆ ప్రవాహానికి తట్టుకోలేక నిండా మునిగిపోయింది. ప్రధాన ఆకర్షణలుగా నిలిచే మ్యూజికల్ లేజర్ షో, సెల్ఫీ పాయింట్ తో పాటు ఉద్యానవనాలు సైతం వరదలో కొట్టుకుపోయాయి. పచ్చటి అందాలు పరుచుకున్న భవానీ ద్వీపం కాస్తా బురదమయమైపోయింది. భారీ చెట్లు నేలకూలాయి, పర్యాటకుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన సామాగ్రి ధ్వంసమైంది. వరద తీవ్రత తగ్గిన తర్వాత భవానీ ద్వీపాన్ని పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వంద మంది కూలీలతో చెత్తా చెదరాన్ని తొలగించి, పరిసరాలు శుభ్రం చేయిస్తున్నారు.
45 రోజుల్లో పూర్తి!
వరద ప్రభావంతో దెబ్బతిన్న భవానీ ద్వీపంలో జరగుతున్న పునరుద్ధరణ పనులను పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పరిశీలించారు. సాధ్యమైనంత త్వరగా భవానీ ద్వీపాన్ని పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. దెబ్బతిన్న వాటన్నింటినీ పునరుద్ధరించేందుకు మూడు నెలలు పడుతుందని అధికారులు అంచనా వేయగా... 45రోజుల్లోనే వాటిని పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో మళ్లీ వరదలు వచ్చినా ఇంత నష్టం జరగకుండా తట్టుకునే స్థాయిలో భవానీ ద్వీపంలో పునరుద్ధరణ పనులు చేపట్టాలని సూచించారు.
రండి..సరదాగా గడపండి!
మ్యూజికల్ లేజర్ షో వ్యవస్థ ప్రైవేట్ కంపెనీ పరిధిలో ఉండడంతో దాని నష్టాన్ని ఆ కంపెనీ వాళ్లే భరిస్తారని అధికారులు తెలిపారు. భద్రతా పరంగా కట్టుదిట్టమైన చర్యలు చేపడతామని మంత్రి పేర్కొన్నారు. వరదల కారణంగా నిలిపివేసిన భవానీ ద్వీపం ఇవాటి నుంచి పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించారు. కృష్ణానదీ ప్రయాణాన్ని ఆస్వాదించడంతో పాటు భవానీ ద్వీపంలో సరదాగా గడిపేందుకు పర్యాటకులు తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఇవాటి నుంచి భవానీ ద్వీప సందర్శనకు అనుమతి!