బెంజిసర్కిల్ (benz circle).. ఇది పెద్ద కూడలి కావడంతో అట్టహాసంగా నిర్వహించేందుకు ఈ ప్రాంతాన్ని ఎంచుకుంటున్నారు. తాజాగా.. శనివారం ‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమం కింద చెత్త తరలింపు వాహనాలను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నగరపాలికలు, పట్టణాలకు కేటాయించిన వాహనాలను ఇక్కడి నుంచే జెండా ఊపి పంపించనున్నారు. గత ప్రభుత్వ హయాంలోనూ నవనిర్మాణ దీక్ష పేరుతో ఇక్కడే నిర్వహించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మూడో కార్యక్రమం. గతంలో అంబులెన్సులు, రేషన్ పంపిణీ వాహనాలను ప్రారంభించారు. రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు బెంజిసర్కిల్‌లో కాకుండా నగరంలోని పెద్ద మైదానాల్లో నిర్వహిస్తే ఇబ్బంది లేకుండా ఉంటుందని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. దీని వల్ల గంటల కొద్దీ ట్రాఫిక్ మళ్లింపులు చేయాల్సిన అవసరం తప్పుతుంది.
నగరవాసులకు నరకం:బెంజిసర్కిల్ (benz circle) వద్ద ఏర్పాటు చేసిన సభా వేదిక నిర్మాణం కోసం శుక్రవారం ఉదయం నుంచే ఏర్పాట్లు ప్రారంభించారు. సీఎం హాజరవుతుండడంతో ఐఎస్‌డబ్ల్యూ, సీఎంఎస్‌జీ బృందాలు ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ముఖ్యమంత్రి వాహనశ్రేణి రిహార్సల్స్ కోసం శుక్రవారం పలుసార్లు ట్రాఫిక్‌ను నిలిపివేశారు. అసలే పద్మవ్యూహాన్ని తలపించే ఈ కూడలి.. కార్యక్రమం ఒక రోజు ముందే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కీలకమైన బందరు రోడ్డులో అటు టికిల్ రోడ్డు, ఇటు మచిలీపట్నం వైపు పటమట వరకు బారులు తీరాయి. శనివారం వేకువజామున 5 గంటల నుంచే నగరంలో ఆంక్షలు అమలులోకి వస్తున్నాయి. ఎన్టీఆర్ కూడలి నుంచి పోలీసు కంట్రోల్ రూమ్ వరకు బందరు రోడ్డుపైకి అనుమతించడం లేదు.