ap mlc candidates : రాజ్యసభకు వైకాపా తరఫున నామినేషన్లు దాఖలు చేసిన నలుగురు అభ్యర్థులు తమ ఆస్తులు, అప్పుల వివరాలతోపాటు నమోదైన కేసుల వివరాలను ఎన్నికల సంఘానికి బుధవారం అఫిడవిట్ రూపంలో సమర్పించారు. వాటిల్లో పొందుపరచిన వివరాల ప్రకారం.. ఎంపీ విజయసాయిరెడ్డిపై 8 ఈడీ, 11 సీబీఐ కేసులున్నాయి. నలుగురు అభ్యర్థులూ కోటీశ్వరులే. వీరిలో బీద మస్తాన్రావు కుటుంబ ఆస్తుల విలువ అత్యధికంగా రూ.243 కోట్లుండగా.. బీసీ నేత ఆర్.కృష్ణయ్య తన ఆస్తుల విలువను రూ.3.50 కోట్లుగా పేర్కొన్నారు.
విజయసాయిరెడ్డి:ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్పై నమోదైన అక్రమాస్తుల కేసుల్లో రెండో నిందితుడుగా (ఏ-2) ఉన్న విజయసాయిరెడ్డిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులు- 8, సీబీఐ కేసులు- 11 ఉన్నాయి. వాటిలో ఆయన ప్రస్తుతం న్యాయ విచారణ ఎదుర్కొంటున్నారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ), అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లతోపాటు నేరపూరిత కుట్ర, మోసం తదితర సెక్షన్ల కింద ఆయనపై కేసులున్నాయి.
తన కుటుంబ ఆస్తుల విలువ రూ. 21.57 కోట్లుగా విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఇందులో వ్యవసాయ, వ్యవసాయేతర, నివాస భవనాల విలువ రూ. 21.42 కోట్లుగా ఉంది. భార్య సునందారెడ్డి వద్ద 1,456 గ్రాముల బంగారం, రూ.2.90 కోట్ల విలువైన వజ్రాలున్నాయి. రూ.24.65 లక్షల రుణాలున్నాయి.
బీద మస్తాన్రావు:బీద మస్తాన్రావు కుటుంబానికి రూ.243 కోట్ల ఆస్తులు, రూ.85 కోట్ల అప్పులున్నాయి. ఇందులో స్థిరాస్తుల విలువ రూ.93 కోట్లు, చరాస్తుల విలువ రూ. 150 కోట్లుగా తెలిపారు. తన పేరుతో రూ.120.72 కోట్లు, భార్య మంజుల పేరుతో 19.85 కోట్లు, హిందూ అవిభాజ్య కుటుంబం కింద తన పేరుతో రూ. 9.43 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయని వెల్లడించారు.
ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ.93 కోట్ల విలువైన వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, నివాస, వాణిజ్య భవనాలున్నాయి. 7,597 గ్రాముల బంగారం, 7,825 గ్రాముల వెండితోపాటు వజ్రాల విలువ రూ.8.02 కోట్లుగా పేర్కొన్నారు. ఎగుమతి పన్నులకు సంబంధించి న్యాయ వివాదంలో ఉన్న రూ. 16.21 కోట్ల అప్పులు, బ్యాంకు రుణాలుగా రూ.69 కోట్లు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు.