తమకు నాణ్యమైన భోజనం అందించి, వసతి గృహంలో సౌకర్యాలు కల్పించాలని.. అనంతపురంలో విద్యార్థులు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గోపాలకృష్ణను కోరారు. అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా.. ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డితో కలిసి నగరంలోని బీసీ సంక్షేమ శాఖ మహిళా వసతిగృహాన్ని మంత్రి పరిశీలించారు. అక్కడ ఉన్న సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం.. ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి సైతం పేదరికాన్ని రూపుమాపడానికి.. ప్రత్యేక ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ప్రతి పేద విద్యార్థి.. విద్యను అభ్యసించినప్పుడే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని నమ్ముతున్నామన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించటానికి.. వంట చేసేవారికి రాష్ట్ర, జిల్లా స్థాయిలో శిక్షణ ఇవ్వడానికి చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. విద్యార్థులకు కావలసినన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి.. ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.