Azadi Ka Amrita Mahotsav Flag Rally: గుంటూరులో ఆజాదీ కా అమృత మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా 750 మీటర్ల జాతీయజెండాతో ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి ప్రారంభమై ఎన్టీఆర్ స్టేడియం వరకు జరిగిన ఈ ప్రదర్శనలో వేలాదిమంది విద్యార్థులు, మహిళలు, అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులు దేశభక్తుల వేషధారణలో అలరించారు. ప్రతి ఒక్కరూ స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితో పని చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు.
har ghar Tiranga: కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలంలోని ప్రైవేట్ పాఠశాలకు చెందిన విద్యార్థులు.. ఆజాదీ కా అమృత మహాత్సవాల్లో భాగంగా జాతీయ జెండా పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. భారతమాతకు జై అంటూ నినాదాలు చేశారు. జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్రపాలిత యానంలోనూ మదర్ థెరిసా నర్సింగ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ విద్యార్థినులు అమృత మహోత్సవాల్లో భాగంగా తల్లిపాల వారోత్సవం నిర్వహించారు. కాకినాడలోనూ.. స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తి నింపేందుకు విద్యార్థులతో భారీగా జాతీయజెండా ప్రదర్శన నిర్వహించారు. 300 మీటర్ల జాతీయ జెండాతో వేలాదిమంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశ నాయకుల వేషధారణలతో విద్యార్థులు ప్రదర్శనలో పాల్గొన్నారు.