Ayesha Meera parents Letter to CJI: ఆయేషా మీరా తల్లిదండ్రులు.. సీజేఐ ఎన్వీ రమణకు లేఖ రాశారు. తమ కుమార్తె అత్యాచారం, హత్య జరిగి 14 ఏళ్ళు గడిచినా.. ఇప్పటికి తమకు ఎటువంటి న్యాయమూ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. 2008లో ఆయేషా కేసులో నార్కో ఎనాలసిస్ చేయాలని హైకోర్టు ఆదేశించినా.. దాన్ని జరగనివ్వలేదన్నారు.
ఆ తర్వాత మహిళా సెషన్స్ కోర్టులో ఉన్నకేసుకు సంబంధించిన ప్రాపర్టీని తగలబెట్టారని చెప్పారు. తగలబెట్టిన వారికి ఎందుకు శిక్ష వేయలేదని ప్రశ్నించారు. సీబీఐ ఆధ్వర్యంలో 2018లో విచారణ చేపట్టారని.. విచారణలో భాగంగా ఖననం చేసిన ఆయేషా శరీర భాగాలను పరీక్షల కోసం సీబీఐ అధికారులు తీసుకెళ్లారని, మూడు సంవత్సరాలు గడుస్తున్నా.. ఇప్పటి వరకూ ఆ బాడీ పార్ట్స్‌ని ఇవ్వకపోగా.. కేసులో పురోగతి లేదని వాపోయారు.