అధునాతన సాంకేతికతను సమర్థంగా వినియోగిస్తూ.. ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తోంది ఏపీఎస్ఆర్టీసీ. వివిధ యాప్‌లను అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలకు మరింత చేరువైంది. ఆర్టీసీ ఆన్‌లైన్, లైవ్ ట్రాక్, చలో యాప్, ప్రథమ్ యాప్‌లతో మొబైల్‌లోనే సమస్త సమాచారం అందుబాటులోకి తెచ్చింది. బస్సుల సమయవేళలు, టికెట్లు బుక్ చేసుకోవడం, రద్దు చేసుకోవడం, బస్సు ఎక్కడుందో తెలుసుకోవడం, సత్వరమే ఫిర్యాదుల పరిష్కారం వంటి సదుపాయాలను యాప్‌ల ద్వారా కల్పిస్తున్నారు. ప్రయాణికులకు ఉత్తమ సేవలందిస్తున్నందుకు గానూ వివిధ విభాగాల్లో జాతీయస్థాయి అవార్డులను ఆర్టీసీ కైవసం చేసుకుంది.
ఆర్టీసీ లైవ్ ట్రాక్ యాప్‌ను 25 లక్షల మందికి పైగా, ఇతర యాప్‌లనూ లక్షలాది మంది డౌన్‌లోడ్ చేసుకున్నారంటే.. వీటికున్న ఆదరణ ఏపాటిదో అర్థమవుతోంది. బస్సు నెంబర్ లేదా సర్వీస్ నెంబర్‌తో బస్సు ఎక్కడుంది.. ఎప్పటికి వస్తుందనే కచ్చితమైన సమాచారాన్ని ఈ లైవ్‌ట్రాక్ యాప్ అందిస్తోంది. దీని కోసం అన్ని బస్సుల్లో వెహికిల్ ట్రాకింగ్ అండ్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ అనే ఆధునిక పరిజ్ఞానాన్ని ఆర్టీసీ వినియోగిస్తోంది. అన్ని డిపోల్లోని 11 వేల బస్సుల్లో జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేసి శాటిలైట్‌తో అనుసంధానించింది. ప్రయాణికుల భద్రత, డ్రైవర్ల పనితీరు వంటి అంశాల్ని పరిశీలించి సమస్యల్ని పరిష్కరిస్తున్నారు. ఆపత్కాలంలో యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే.... సమీప పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు వెళ్లేలా ఏర్పాటు చేశారు.