Rape Attempt: విజయవాడలో బాలికపై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం - విజయవాడ తాజా వార్తలు
09:22 May 02
బాలిక కేకలు వేయడంతో పరారైన ఆటోడ్రైవర్
Rape Attempt on Girl: ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారయత్నం చేశాడు. నూజివీడుకు చెందిన బాలికకు బెంగళూరు వాసి ఆంజనేయులు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆంజనేయులు విజయవాడ వచ్చినట్లు తెలుసుకున్న బాలిక... అతడిని కలిసేందుకు విజయవాడ వెళ్లింది. హోటల్ అడ్రస్ చూపిస్తానంటూ బాలికను డ్రైవర్ ఆటోలో ఎక్కించుకున్నాడు. నేరుగా నున్న ప్రాంతంలోని పొలాల్లోకి తీసుకెళ్లాడు. బాలికను కామవాంఛ తీర్చమని ఆటో డ్రైవర్ కత్తితో బెదిరించాడు. వెంటనేబాలిక వద్ద ఉన్న మెుబైల్ ఫోన్ లాక్కున్నాడు. రూ.5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆమె చేయిపట్టుకొని హత్యాచారానికి యత్నించాడు. వెంటనే బాలిక పెద్దగా కేకలు వేయడంతో అక్కడినుంచి ఆటో డ్రైవర్ పరారయ్యాడు. దగ్గరలో ఉన్న ఇంట్లోకి వెళ్లిన మైనర్ బాలిక... ఓ వృద్ధురాలి దగ్గర చేరింది. అనంతరం ఆమె కృష్ణలంక పోలీసులకు బాలిక ఫిర్యాదు చేసింది. నిందితుడు సింగ్‌నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్‌గా పోలీసులు గుర్తించారు.
వేగంగా స్పందించాం: విజయవాడలో బాలికపై అత్యాచారయత్నం ఘటనపై వేగంగా స్పందించామని సీపీ కాంతిరాణా టాటా అన్నారు. 100 డయల్‌కు కాల్ రాగానే ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. యువతిని క్షేమంగా కుటుంబానికి అప్పగించినట్లు పేర్కొన్నారు. స్నేహితుడి కోసం ఆదివారం రాత్రి 10 గంటలకు యువతి విజయవాడ చేరుకున్నట్లు చెప్పారు. స్నేహితుడు బస చేసిన హోటల్ కోసం ఆటో డ్రైవర్‌ను యువతి ఆశ్రయించిందని.. ఆటో ఛార్జి విషయంలో యువతికి, డ్రైవర్‌కు మధ్య వాగ్వాదం జరిగిందని తెలిపారు. ఆటో డ్రైవర్ యువతి చేయి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించినట్లు చెప్పారు. ఆటో డ్రైవర్‌ను ప్రతిఘటించి 100కు యువతి కాల్ చేసిందని... ఐదు నిమిషాల్లోనే ఘటనాస్థలికి చేరుకున్నామని సీపీ వెల్లడించారు. ముఖపరిచయం లేని వ్యక్తులను నమ్మవద్దని సీపీ కాంతిరాణా టాటా సూచించారు. మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మహిళలు, యువతులు దిశ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని.. ఆపద సమయంలో దిశ యాప్ రక్షణ కవచంలా ఉంటుందని సీపీ కాంతిరాణా టాటా తెలిపారు.
కృష్ణలంక సీఐ:విజయవాడలో తెల్లవారుజామున బాలికపై అత్యాచారయత్నం జరిగిందని కృష్ణలంక సీఐ సత్యానందం తెలిపారు. ఆటో డ్రైవర్‌ను అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు. బెంగళూరు వాసి ఆంజనేయులను కూడా విచారణకు పిలిచామని వెల్లడించారు. ఇంట్లో ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని బాలిక తెలిపిందన్నారు. బాలికను తల్లికి అప్పగించినట్లు చెప్పారు. బాలిక ఫిర్యాదు చేయగానే స్పందించి నిందితుడిని అరెస్టు చేశామని సీఐ సత్యానందం స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: మున్సిపల్ ఎన్నికల్లో ఓటేయలేదని.. దాచేపల్లిలో తెదేపా కార్యకర్త ఇంటిపై దాడి