తొలిదశ నామినేషన్ల చివరిరోజు దాడుల పర్వం పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ చిత్తూరు జిల్లాలో ఉద్రిక్తతలకు దారి తీసింది. జిల్లాలోని యాదమరిలో మండల ఎంపీడీవో కార్యాలయం వద్ద తెదేపా శిబిరంపై దుండగులు దాడి చేశారు. నామినేషన్లు వేసే వారికి మద్దతిస్తున్న తెదేపా కార్యకర్తలపై విచక్షణారహితంగా దాడికి దిగారు. ద్విచక్ర వాహనాలు, కార్లు ధ్వంసం చేశారు. ఫర్నిచర్ పగలగొట్టారు. నామినేషన్ ప్రక్రియ పరిశీలనకు వచ్చిన తెదేపా ఎమ్మెల్సీ దొరబాబు కారుపైనా.. రాళ్ల దాడి చేశారు. కారు అద్దాలు పగలగొట్టారు.
తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం గొల్లలగుంటలో తెలుగుదేశం మద్దతిచ్చిన సర్పంచ్ అభ్యర్థి పుష్పవతి భర్త శ్రీనివాస్ రెడ్డి అపహరణకు గురయ్యారు. తన భర్తను అధికార పార్టీ వారు కిడ్నాప్ చేసి... కాళ్లు, చేతులు కట్టి గోవిందపురం అడవిలో వదిలేశారన్న పుష్పవతి... పశువుల కాపరి కాపాడినట్లు వివరించారు. భయపెట్టినా బెదిరిపోకుండా నామినేషన్ వేశామన్నారు.
అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైకాపా నేతలు దాడులకు పాల్పడుతున్నారంటూ... కృష్ణా జిల్లా వత్సవాయి మండలం తాళ్లూరు వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. తెదేపా బలపరిచిన అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు వెళ్తున్నప్పుడు ఘర్షణకు దిగి ఆటంకం కలిగించారని... నామినేషన్ వేసి వస్తుండగా దాడికి దిగారని మండిపడ్డారు.
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం సీతారాంపురంలో హనుమంతునాయుడుపేట పంచాయతీకి నామినేషన్లు వేస్తున్న అభ్యర్థులను అధికార పార్టీ నేతలు అడ్డుకున్నారు. అధికారులు, పోలీసుల సమక్షంలో నామపత్రాలను తీసుకెళ్లిపోయారు. తెదేపా బలపరిచిన గౌతమి అనే అభ్యర్థి నామినేషన్ వేస్తుండగా అడ్డుకోగా... ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు జోక్యంతో గౌతమి నామినేషన్ వేశారు. ఆకాశలక్కవరం సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేయడానికి వచ్చిన అప్పలకొండ నామప్రతాలను వైకాపా వర్గీయులు తీసుకెళ్లారు. పోలీసులు జోక్యం చేసుకుని నామినేషన్ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురంలో స్వయం సహాయక సంఘాల గ్రామ సమాఖ్య అసిస్టెంటుగా పనిచేస్తున్న రమాదేవి... వార్డు మెంబర్‌గా పోటీ చేయకపోతే తనను ఉద్యోగం నుంచి తీసి వేస్తామని వైకాపా నాయకులు బెదిరించినట్లు ఆరోపించారు. వైకాపా నాయకుడు వాసు ఇంటి ఎదుట ఆందోళనకు దిగిన ఆమె.. తాను వార్డు మెంబర్‌గా పోటీ చేయలేనని, తన కుటుంబానికి ఆధారంగా ఉన్న ఉద్యోగం పోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ నిరసన చేపట్టారు. యడ్లపాడు పోలీసులు రమాదేవిని స్టేషన్‌కు తరలించి వివరాలు నమోదు చేసుకొని పంపించారు.
కడప జిల్లా అట్లూరు మండలం కామసముద్రం గ్రామ పంచాయతీకి నామినేషన్ వేసేందుకు వేములూరుకు వెళ్తున్న తెదేపా సానుభూతిపరుడైన లక్ష్మీరెడ్డిని వైకాపా నాయకులు అడ్డుకుని.. నామినేషన్ పత్రాలను చించేశారు. సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లి బెదిరించినట్లు పోలీసులకు ఆయన అనుచరులు సమాచారం ఇచ్చారు. పోలీసుల చొరవతో లక్ష్మీరెడ్డి వేములూరు వెళ్లి నామినేషన్ వేశారు.
ఇదీ చదవండి:ఇంతకీ ఎన్నికల కోడ్ అంటే ఏంటి? మెుదట ఎక్కడ అమలైంది?