Pawan: ఎస్సీలపైనే అట్రాసిటీ కేసులు.. వైకాపా దాష్టీకాలను దీటుగా ఎదుర్కొంటాం: పవన్ - Jana sena party President
20:21 September 23
జనసేన విజయం రాష్ట్రంలో సంపూర్ణ మార్పుకు సంకేతం
రాష్ట్రంలో వైకాపా దాష్టీకాలు పెరిగిపోయాయని..అయినా ధీటుగా ఎదుర్కొంటున్నామని జనసేన అధినేత పవన్ అన్నారు. ఎస్సీలపైనే ఎస్సీ అట్రాసిటీ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు సృష్టించినా..పరిషత్ ఎన్నికల్లో 25.2 శాతం ఓట్లు సాధించామన్నారు. నామినేషన్ నుంచి కౌంటింగ్ వరకూ వైకాపా అరాచకాలు చేస్తుంటే అధికార యంత్రాంగం చోద్యం చూసిందని దుయ్యబట్టారు. ప్రజలు 151 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే...మంచి పాలన అందించాల్సింది పోయి దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆక్షేపించారు. వైకాపా దాష్టిక పాలనకు వ్యతిరేకంగా క్షేత్రస్థాయి పోరాటాలకై ఈ నెల 27, 28 తేదీల్లో విజయవాడలో నిర్వహించనున్న పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కార్యాచరణ రూపొందిస్తామన్నారు.
ఒక్క ఎమ్మెల్యేతో ప్రారంభమైన జనసేన ప్రస్థానం..మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 1,209 సర్పంచులు, 1,576 ఉపసర్పంచులు, 4,456 వార్డు సభ్యులు గెలిచేదాకా వెళ్లిందని అన్నారు. అలాగే పరిషత్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసింది 1,200 స్థానాలైనా..177 చోట్ల గెలుపొందిందని వెల్లడించారు. మరో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు తమ పార్టీ మద్దతుతో గెలిచారన్నారు. రెండు జెడ్పీటీసీ స్థానాల్ని జనసేన కేవసం చేసుకుందని పేర్కొన్నారు. తమ పార్టీ విజయం చిన్నదిగానే కనిపించవచ్చు కానీ సంపూర్ణ మార్పునకు ఇది బలమైన పాదముద్రగా పవన్ అభివర్ణించారు.
ఇదీ చదవండి:PAWAN KALYAN: వచ్చే నెలలో విశాఖకు పవన్‌కల్యాణ్..స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతు