11 అట్లు కూడా ఇస్తారు!
ఆశ్వయుజ బహుళ తదియనాడు వచ్చే అట్లతద్దె పండుగ రోజున సూర్యోదయానికి ముందే లేచి స్నానమాచరించి, ఉపవాసముండాలి. ఇంట్లో తూర్పుదిక్కున మంటపం ఏర్పాటు చేసి గౌరీదేవి పూజ చేయాలి. ధూప, దీప, నైవేద్యాలు పెట్టి, వినాయక పూజ తర్వాత, గౌరీ స్తోత్రము, శ్లోకాలు, పాటలు పాడటం చేయాలి. సాయంత్రం చంద్ర దర్శనం తర్వాత తిరిగి స్నానం చేసి మళ్లీ గౌరీ పూజచేసి, 10 అట్లు నైవేద్యంగా పెట్టాలి. ముత్తైదువులకు అలంకారం చేసి 10 అట్లు, 10 ఫలాలు వాయనంగా సమర్పించాలి. అట్లతద్దె నోము కథను చెప్పుకొని, అక్షతలు వేసుకోవాలి. ప్రాంతపు ఆనవాయితీని బట్టి 11 అట్లుకూడా ఇస్తారు.
అట్లతద్ది విశిష్ఠతపై ఓ కథ
పూర్వం ఒక మహారాజుకు కుమార్తె ఉండేది. ఆమె పేరు కావేరి. కావేరి తన తల్లి ద్వారా అట్లతద్దె వ్రత మహిమను తెలుసుకుని తన రాజ్యంలో ఆమె స్నేహితురాళ్లైన మంత్రి కూతురు, సేనాపతి కూతురు, పురోహితుని కూతురుతో కలిసి చంద్రోదయ ఉమావ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించింది. తోటి మంత్రి, సేనాపతి, పురోహితుడి కూతుళ్లకు వివాహ వయస్సు రాగానే నవయవ్వనులైన అందమైన భర్తలతో వివాహం జరిగింది. దీంతో మహారాజు.. అమ్మాయి స్నేహితురాళ్లకు వివాహాలు జరిగిపోవుచున్నవని తలచి తన కుమార్తెకు వివాహ ప్రయత్నాలు చేయడం ప్రారంభించారు. కావేరికి యవ్వనులు గాకుండా వృద్ధులైన వారే పెండ్లికుమారులుగా వచ్చేవారు.
మహారాజు ప్రయత్నాలన్నీ విఫలం కావడం చూచిన రాకుమార్తె కావేరి కలతచెంది.. రాజ్యంను వదిలి సమీప అరణ్యములో ఘోర తపస్సు చేసింది. ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు కావేరీకి ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమనగా..! కావేరి తన అట్లతద్దె వ్రతాచరణ చేసినా ఫలితం దక్కలేదని.. నా వ్రతములో ఏదైనా దోషమేమిటని? ప్రశ్నిస్తూ.. దుఃఖించింది.
అంతటితో పార్వతీపరమేశ్వరులు ఓ సౌభాగ్యవతి.. ఇందులో నీ దోషము ఏ మాత్రం లేదు. నీవు ఆ అట్లతద్దె నోచే సమయంలో ఉపవాసదీక్షకు తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోగా, విషయమంతా నీ తల్లిద్వారా తెలుసుకున్న నీ సోదరులు ఒక ఇంద్రజాల విద్యను ప్రదర్శించి అద్దముగుండా నీకు చంద్రునిని చూపించినారు.