ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నిరుద్యోగ యువతను అరెస్టు చేయడం దారుణం: అచ్చెన్నాయుడు

ముఖ్యమంత్రి జగన్ నిరుద్యోగులకు ఇచ్చిన మాట తప్పటం వల్లే నేడు యువత రోడ్లపైకి వస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. నిరుద్యోగ యువతను అరెస్టు చేయడం దారుణమన్న ఆయన.. ఎన్నికల హామీ మేరకు వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి యువతపై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తేయాలని డిమాండ్ చేశారు.

అచ్చెన్నాయుడు
అచ్చెన్నాయుడు

By

Published : Mar 12, 2022, 7:41 PM IST

నిరుద్యోగ యువతను అక్రమంగా అరెస్టు చేయటం దారుణమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రభుత్వంపై మండిపడ్డారు. టీఎన్​ఎస్​ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్​ సహా అరెస్టు చేసిన వారందరినీ తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో నిరుద్యోగం 14 శాతం పెరిగటంతో పాటు.., నిరుద్యోగుల ఆత్మహత్యల్లో ఏపీ అగ్రస్థానానికి చేరిందని అచ్చెన్న ధ్వజమెత్తారు. దాదాపు 400 మందికి పైగా యువకులు గత రెండున్నరేళ్లలో ఉద్యోగాలు రాలేదనే మనస్థాపంతో బలవన్మరణాలకు పాల్పడ్డారని ఆరోపించారు.

జగన్ తాను ఇచ్చిన హామీని విస్మరించటం వల్లే నేడు యువత రోడ్లపైకి వస్తున్నారన్నారు. రెండున్నరేళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా యువతను మోసం చేసిన జగన్ రెడ్డికి.. ఇంకా ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత ఏమాత్రం లేదన్నారు. ఎన్నికల హామీ మేరకు వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి.., నిరుద్యోగ యువతపై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

రాష్ట్రవ్యాప్త ఆందోళనలు.. అరెస్టులు
ఉద్యోగ ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు ఆందోళన బాటపట్టారు. విజయవాడ ధర్నాచౌక్ లో నిరుద్యోగ, యువజన సంఘాలు చేపట్టిన ధర్నాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ధర్నాచౌక్‌కు చేరుకున్న నిరుద్యోగ యువత, యువజన సంఘాల నేతలను అరెస్ట్ చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులకు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయడంతోపాటు.. ఉద్యోగం వచ్చేవరకు 5 వేలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ యువజన సంఘాలు ధర్నాకు పిలుపునిచ్చాయి. మెగా డీఎస్సీ ద్వారా 25 వేల టీచర్ పోస్టుల భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాకు తెదేపా మద్దతు తెలిపింది. ధర్నా చౌక్‌ వద్దకు చేరుకున్న తెలుగు యువత నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ గురించి అడిగితే ప్రభుత్వం నిరుద్యోగులను జైలులో పెట్టి హింసిస్తోందని తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్‌చినబాబు మండిపడ్డారు.

శ్రీకాకుళంలోనూ తెదేపా ఆధ్వర్యంలో యువత ధర్నా చేపట్టింది. ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేయాలంటూ 7 రోడ్ల కూడలిలో నిరుద్యోగులు చేపట్టిన దర్నాను పోలీసులు భగ్నం చేశారు. యువజన సంఘాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. విజయవాడలో చేపట్టిన మహా ధర్నాకు మద్ధతుగా.. విజయనగరం జిల్లా ఉద్యోగ పోరాట సమితి నిరసన తెలియచేసింది. ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా చేపట్టిన నిరసనలో యువజన సంఘాలు పాల్గొన్నాయి. తిరుపతిలో అన్నమయ్య కూడలి నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు నిరుద్యోగులు ర్యాలీ నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యోగ క్యాలెండర్ పై చర్చించాలని డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఎటువంటి మేలు జరగలేదని ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి

Students Protest: విజయవాడ ధర్నాచౌక్‌లో నిరుద్యోగుల ఆందోళన ఉద్రిక్తం..

ABOUT THE AUTHOR

...view details