ATCHENNA: కోనసీమ ఘటన ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదమేనని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ప్రశాంతమైన కోనసీమను విధ్వంసం చేయాలని జగన్ రెడ్డి కంకణం కట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 3ఏళ్లలో తెదేపా ఏ కార్యక్రమం చేపట్టినా గృహనిర్బంధాలతో అణిచివేయాలని చూశారని మండిపడ్డారు. అమలాపురంలో ఆందోళనలు 5 రోజులుగా జరుగుతున్నా పట్టించుకోలేదంటే ప్రభుత్వ ప్రేరేపిత కార్యక్రమం కాక మరేంటని ప్రశ్నించారు. విశ్వరూప్ ఇంటిపై దాడికి ముందు ఆయన కుటుంబసభ్యుల్ని అక్కడి నుంచి తరలించారంటే దాడి జరుగుతుందని పోలీసులకు ముందే తెలుసా అని నిలదీశారు. పోలీసులకు విషయం తెలిసి కూడా బందోబస్తు పెట్టలేదంటే వాళ్లని ఏమనాలని ధ్వజమెత్తారు.
ముఖ్యమంత్రి పదవి కోసం రాజశేఖర్రెడ్డి చావుని వాడుకోవడంతోపాటు.. బాబాయిని హత్య చేసిన ఘనుడు జగన్మోహన్రెడ్డి అని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల దృష్టి మళ్లించటంలో జగన్ నేర్పరి అన్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు హత్య ఉదంతాన్ని మళ్లించేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలు, తెలుగుదేశం నిర్వహించే మహానాడును దారి మళ్లించేందుకే అమలాపురంలో విధ్వంసం మొదలుపెట్టారని దుయ్యబట్టారు.