ASHUTOSH MISHRA REPORT: రాష్ట్ర ప్రభుత్వం నియమించిన అశుతోష్ మిశ్ర కమిషన్ సమర్పించిన వేతన సవరణ నివేదికను అమలు చేస్తే.. ప్రభుత్వ ఖజానాపై పడే అదనపు భారం రూ.3,181 కోట్లు అని లెక్కించింది. అప్పటికే ప్రభుత్వం మధ్యంతర భృతి 27 శాతం చెల్లిస్తుండటం వల్ల రూ.9,645 కోట్ల భారం పడుతోందని పేర్కొంది. కమిషన్ సిఫార్సుల వల్ల మొత్తం భారం రూ.12,826 కోట్లుగా పేర్కొంటూ అందులో మధ్యంతర భృతి రూపంలో అప్పటికే ప్రభుత్వం భరిస్తున్న భారాన్ని మినహాయిస్తే ప్రభుత్వంపై కొత్తగా పడే భారం రూ.3,181 కోట్లే అని తేల్చి చెప్పింది.
సర్కారు చెబుతున్న లెక్క రూ. 11,707 కోట్లు..!
ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ (ఐఎల్‌సీ) నిబంధనల ప్రకారం పీఆర్సీ కమిషన్ 23 శాతం ఫిట్‌మెంట్‌గా లెక్కించిందని.. కానీ అప్పటికే 27 శాతం మధ్యంతర భృతిని (ఐఆర్) ఇస్తున్నందున దానినే ఫిట్‌మెంట్‌కు సిఫార్సు చేసిందని ప్రభుత్వం వెల్లడించింది. పీఆర్సీ వల్ల ఏడాదికి అదనపు వ్యయం రూ.11,707 కోట్లవుతుందని పేర్కొంది. ‘గత కొన్నేళ్లుగా అధిక ఫిట్‌మెంట్‌ల కారణంగా రాష్ట్ర ఆదాయాలకు మించి మానవ వనరుల వ్యయం పెరుగుతోంది. అధిక ఫిట్‌మెంట్ ప్రయోజనాలతో ప్రభుత్వం ప్రతి ఐదేళ్లకూ వేతన సవరణలు కొనసాగించలేదు. అందువల్ల కేంద్రం ఏడో వేతన సంఘాన్ని అనుసరించి కార్యదర్శుల కమిటీ 14.29 శాతం ఫిట్‌మెంట్‌కు సిఫార్సు చేసింది. కేంద్ర ప్రభుత్వం పదేళ్ల ప్రాతిపదికన 14.29 శాతం ఫిట్‌మెంట్ ప్రయోజనాన్ని మంజూరు చేసింది. ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు తదితర చాలా రాష్ట్రాలు సైతం 14.29 శాతం ఫిట్‌మెంట్‌ను అందించాయి. కేరళ తన ఉద్యోగులకు 10 శాతం బెనిఫిట్ ఫిట్‌మెంట్ ఇచ్చింది’ అని వివరించింది.