రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ సీఎం జగన్‌కు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు లేఖ రాశారు. తెదేపా సహా ఇతర పక్షాలపై దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. హత్యలు, హత్యాయత్నాలు, అనుమానాస్పద మరణాలకు అంతులేకుండా పోయిందన్నారు. రాజ్యాంగం కల్పించిన మానవ హక్కులను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని ధ్వజమెత్తారు.
అచ్చెన్నాయుడుపై హత్యాయత్నం కింద అక్రమ కేసు పెట్టి అరెస్టు చేయడం హేయమని అశోక్‌బాబు దుయ్యబట్టారు. పట్టపగలు పట్టాభిరామ్‌పై హత్యాయత్నం చేసినా.. ఇంతవరకు దోషులపై చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాభికి భద్రతపై వారం క్రితం పోలీసు అధికారుల దృష్టికి తెచ్చినా.. నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు.