ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తరుముకొస్తున్నఅసని తుపాను.. రాష్ట్రంలో భారీ వర్షాలు

అసని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఈదురు గాలులుతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాల్లో చాలా చోట్ల ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పంటలు దెబ్బతిన్నాయి. తుపాను తీరం దాటే క్రమంలో మరింత విధ్వంసం ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు ఎక్కడికక్కడ అప్రమత్తమయ్యారు.

అసని తుపాను
అసని తుపాను

By

Published : May 11, 2022, 5:37 AM IST

తరుముకొస్తున్నఅసని తుపాను.. రాష్ట్రంలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను ప్రభావంతో.. పశ్చిమగోదావరి జిల్లాలో తీరం అల్లకల్లోలంగా మారింది. తీరంలోని పీఎం లంక, సీఎం లంక, కెపీపాలెం, పేరుపాలెం ప్రాంతంలో అలల ఉద్ధృతి భారీగా పెరిగింది. కెరటాల ధాటికి పీఎంలంకలో కొబ్బరి, సర్వి తోటలు కోతకు గురవుతున్నాయి. చిరుజల్లులు, సముద్రపు పోటుతో ఉప్పుముడులు నీటమునిగాయి. వర్షంతో చాలా చోట్ల వరి పంట నీట మునిగింది.

కాకినాడ జిల్లాపై అసని ప్రభావం చూపే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. కాకినాడ- ఉప్పాడ తీరంలో పరిస్థితిని ఎస్పీ రవీంద్రనాథ్ బాబు పరిశీలించారు. బీచ్ రోడ్ లో స్థానిక మత్స్యకార కుటుంబాలతో చర్చించిన ఆయన...అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోనసీమ జిల్లాలో వరి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పంటలు కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు.
కృష్ణా జిల్లా, అవనిగడ్డ నియోజకవర్గంలో అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన చిరుజల్లులు పడ్డాయి. హంసలదీవి వద్ద సముద్రపు అలలు ఎగసిపడుతున్నాయి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. హంసలదీవి బీచ్ గేట్లను మెరైన్ పోలీసులు మూసివేశారు. నియోజకవర్గంలోని 6 మండలాల్లో కంట్రోల్ రూంలను రెవిన్యూ అధికారులు ఏర్పాటు చేశారు. బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్‌లో హెచ్చరికలు జారీ చేశారు. బాపట్ల, చీరాల ఆర్డీవో కార్యాలయాలతోపాటు అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. మత్స్య కారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. దుగ్గిరాలలో మొక్కజొన్న రైతులు ఆవేదన చెందుతున్నారు. రేపల్లె తీర ప్రాంతంలోఅధికారులు పోలీసులతో గస్తీ ఏర్పాటు చేశారు.
ప్రకాశం జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంత మండలాలైన... ఒంగోలు, కొత్త పట్నం, టంగుటూరు,.... నాగులుప్పలపాడు మండలాల్లో ఈదురు గాలులు వీస్తున్నాయి. జరుగుమిల్లి మండలంలో అత్యధికంగా 34 మిల్లీ మీటర్లు , ఒంగోలులో 26 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది. ఒంగోలు.. కలెక్టరేట్ లో 1077 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. నెల్లూరులోనూ తీవ్ర గాలులతో కూడిన వర్షం కురిసింది. గుడ్లురు, కందుకూరులో భారీ వర్షం కురుస్తోంది. కావలిలో భారీ వర్షంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.

కడపలో లోతట్టు ప్రాంతాలను వర్షపు నీరు ముంచెత్తింది. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. అంబేడ్కర్ కూడలి, ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు, చిన్నచౌక్ రోడ్, అప్సర కూడలి,...... మృత్యుంజయ కుంట, శాస్త్రి నగర్, రామకృష్ణ నగర్ జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిచి ప్రజలు ఇబ్బంది.... పడ్డారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో చోట్ల కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. స్తంభాలు విరిగిపోయాయి.

విశాఖ తీరంలో సముద్ర అలలు ఎగిసిపడుతున్నాయి. జీవీఎంసీలో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు.సహాయక చర్యలకు విపత్తు నిర్వహణ బృందాలతోపాటు కోస్ట్‌గార్డ్, నేవీ బృందాలూ....... సిద్ధంగాఉన్నాయి. 19 వరద సహాయ బృందాలు, ఆరు డైవింగ్ బృందాలు జెమినీ బోట్లతో సిద్ధంగా ఉన్నట్లు తూర్పు నౌకాదళం అధికారులు తెలిపారు. 5 ఇండియన్ నేవీ నౌకలు సహాయ సామగ్రితో అప్రమత్తంగా ఉన్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:'అసని' ఎఫెక్ట్​: రేపు జరగాల్సిన ఇంటర్ పరీక్ష వాయిదా

ABOUT THE AUTHOR

...view details