తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలను(intermediate exams in telangana) ఈ సారి పకడ్బందీగా నిర్వహించనున్నట్లు.. ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది. ఇంటర్ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షల అధికారి అబ్దుల్ ఖాలిక్, ఓఎస్డీ సుశీల్ కుమార్, సంయుక్త కార్యదర్శులు భీమ్ సింగ్, శ్రీనివాస్ తదితరులతో కలిసి జలీల్ శనివారం విలేకర్లతో మాట్లాడారు. ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామని.. విద్యార్థులు భయపడకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరు కావాలని అధికారులు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4 లక్షల 59 వేల మంది ఇంటర్ విద్యార్థులు ఉండగా.. వారికోసం కొవిడ్ భద్రతా చర్యల దృష్ట్యా ఈసారి పరీక్ష కేంద్రాలు పెంచామన్నారు. మొత్తం 1768 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతాయని బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ తెలిపారు. ఈసారి 70 శాతం సిలబస్‌తో పరీక్ష నిర్వహిస్తున్నందున.. ఆ సిలబస్‌కు పరిమితమయ్యే పరీక్ష ఉంటుందని, అదేవిధంగా ఈనెల 31న ఆదివారం రోజున సైతం పరీక్ష ఉంటుందని ఈ విషయాలు విద్యార్థులు గమనించాలని కోరారు.
పరీక్షలు జరపాల్సిన అనివార్య పరిస్థితి
ఇంటర్ ప్రథమ సంవత్సరంలో తప్పితే కనీస మార్కులతో ఉత్తీర్ణులను చేయమని, మళ్లీ వారు మార్చి/ఏప్రిల్‌లో పరీక్షలు రాసి పాస్ కావాల్సిందేనని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ స్పష్టం చేశారు. ప్రభుత్వంతో చర్చించి వీలుంటే అడ్వాన్స్ సప్లిమెంటరీ తరహాలో మరోసారి పరీక్షలు జరిపేందుకు ఆలోచిస్తామని తెలిపారు. ఒకవేళ కరోనా కారణంగా వచ్చే మార్చి, ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహించడానికి వీల్లేని పరిస్థితులు తలెత్తితే తొలి ఏడాది పరీక్షల్లో వచ్చిన మార్కులనే ప్రామాణికంగా తీసుకొని రెండో ఏడాదికి కేటాయించి ఉత్తీర్ణులను చేయాల్సి ఉంటుందన్నారు. అందుకే పరీక్షలు జరపాల్సిన అనివార్య పరిస్థితి ఉందని, ప్రతి విద్యార్థి తప్పకుండా రాయాలని సూచించారు. హాల్ టికెట్‌పై ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదని విద్యార్థులు తమ ఇంటి నుంచి వాటిని డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.