ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ప్రభుత్వ వాహనాలకు ఆర్టీసీ డీజిల్ ​'.. ఏర్పాటు చేస్తున్న సర్కార్​ - RTC Diesel supply to govt vehicles

RTC Diesel supply to Govt Vehicles in AP: ప్రభుత్వ వాహనాలకు ఆర్టీసీ ద్వారా డీజిల్ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలవారీగా వాహనాల వివరాలు సేకరిస్తున్నారు. పారదర్శకత కోసం ప్రతి వాహనానికీ ఆర్​ఎఫ్​ఐడీ కార్డు జారీ చేయాలని నిర్ణయించారు.

RTC Diesel supply to Govt Vehicles in AP
ప్రభుత్వ వాహనాలకు ఆర్టీసీ డీజిల్ సరఫరా

By

Published : Apr 3, 2022, 4:40 PM IST

RTC Diesel supply to Govt Vehicles: ప్రభుత్వ వాహనాలన్నింటికీ ఆర్టీసీ డిపోల్లోని బంకుల ద్వారా డీజిల్ సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు పోలీస్ శాఖ మినహా మిగిలిన అన్నిశాఖల వాహనాలకు బయటి పెట్రోల్ బంకుల్లోని డీజిల్ వినియోగిస్తూ వచ్చారు. ఆ వాహనాలకు ఆర్టీసీ డిపోల్లోనే డీజిల్‌ తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం శాఖలవారీగా రాష్ట్ర, జిల్లా, డివిజనల్, మండలస్థాయి అధికారుల వాహనాల వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆర్టీసీ యాజమాన్యం కోరింది. రవాణాశాఖకు తన సొంత బస్సులు, అద్దె బస్సులకు కలిపి ఏటా దాదాపు 29 కోట్ల లీటర్ల డీజిల్ వినియోగిస్తోంది. చమురు సంస్థలు బయటి బంకుల కన్నా ఆర్టీసీకి లీటర్​కు రూ. 3 లేదా 5 తక్కువకు సరఫరా చేస్తుంటాయి. అందువల్ల ప్రభుత్వ వాహనాలు అన్నింటికీ రాష్ట్రంలో 129 ఆర్టీసీ డిపోల్లో ఉండే బంకుల్లోని డీజిల్‌నే వినియోగించాలని నిర్ణయించారు.

అధికారి ఫోన్‌కు మెసేజ్: పోలీస్ శాఖ మినహా ఇతరశాఖల్లో 10 వేల వరకు ప్రభుత్వ వాహనాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఒక్కో వాహనానికి సగటున నెలకు 200 లీటర్ల చొప్పున 20 లక్షల లీటర్లు.. ఏడాదికి 2 కోట్ల 40 లక్షల లీటర్ల డీజిల్ అవసరమని లెక్కేశారు. ఆయా ప్రభుత్వ వాహనాలు వినియోగించే అధికారులకు రేడియో ఫ్రీక్వెనీ ఐడెంటిఫికేషన్(R.F.I.D) జారీ చేయనున్నారు. డీజిల్ పోయించుకున్న ప్రతిసారీ.. ఎంత డీజిల్ తీసుకున్నారు..? ఆ నెలలో ఇంకా ఎంత కోటా ఉంది..? వంటి వివరాలతో ఆ అధికారి ఫోన్‌కు మెసేజ్ వెళ్తుంది.

అయితే.. ఈ కార్డుల జారీప్రక్రియ మొదలయ్యేలోపు తొలుత కొద్దిరోజులు మాన్యువల్​గా వివరాలు నమోదుచేసి ప్రభుత్వ వాహనాలకు డీజిల్ నింపుతారని చెబుతున్నారు. ఆర్టీసీ డీజిల్ వినియోగించడం వల్ల ధర కొంత తగ్గడం సహా తప్పుడు లెక్కలు చూపే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. ఆర్టీసీ వినియోగించిన డీజిల్‌కు గానూ చమురు సంస్థలకు ప్రతి 2, 3 రోజులకు చెల్లింపులు చేస్తుంటారు. ప్రభుత్వ వాహనాలకు సరఫరా చేసే డీజిల్‌కు ఆలస్యం లేకుండా ఎప్పటికప్పుడు ఆర్టీసీకి సొమ్ము చెల్లించేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి:ఆట ఆడాలంటే.. డబ్బు కట్టాల్సిందే.. రాష్ట్ర సర్కారు కొత్త రూల్..!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details