ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దసరా ఉత్సవాలకు సిద్ధమైన ఇంద్రకీలాద్రి.. నేడు స్వర్ణ కవచాలంకృత రూపం - స్వర్ణకవచాలంకృత రూపం

DUSSEHRA ARRANGEMENTS : దసరా ఉత్సవాలకు బెజవాడ ఇంద్రకీలాద్రి సిద్ధమైంది. నేటి నుంచి అక్టోబర్‌ 5 వరకు జరగనున్న వేడుకల కోసం.. దేవస్థానం సిబ్బంది, అధికారులు, పోలీసులు.. అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. కొవిడ్‌ తర్వాత జరుగుతున్న ఉత్సవాలు కావడంతో.. భక్తులు భారీగా వస్తారని అంచనా వేస్తున్నారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి అమ్మవారి ఆలయం, ఉపాలయాల్లోని మూర్తులకు.. స్నపనాభిషేకాలు నిర్వహిస్తున్నారు. అందుకే తొలిరోజు ఉదయం 9 గంటల నుంచి భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.

DUSSEHRA ARRANGEMENTS
DUSSEHRA ARRANGEMENTS

By

Published : Sep 25, 2022, 1:26 PM IST

Updated : Sep 26, 2022, 6:54 AM IST

Dussehra Arrangements at Indrakeeladri : ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజైన నేడు అమ్మవారు స్వర్ణ కవచాలంకృత కనక దుర్గాదేవిగా దర్శనిమిస్తారు. ఈ రూపంలో అమ్మవారిని దర్శించుకోవడం వల్ల అన్ని కష్టాలు పోయి.. మేలుతో పాటు ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుందని భక్తుల నమ్మకం. ఉత్సవాల రెండో రోజు నుంచి ఉదయం 4 గంటల మొదలు రాత్రి 11 వరకూ దర్శనానికి అనుమతిస్తారు. రోజూ సాయంత్రం ఆరున్నర నుంచి ఏడున్నర వరకు అమ్మవారికి మహానివేదన, పంచహారతులు,చతుర్వేద స్వస్తి కార్యక్రమాలు ఉంటాయి.

ఆ సమయంలో దర్శనాలను నిలిపేస్తారు. ఆలయంలో ప్రతిరోజు సాయంత్రం ఆరున్నరకు మల్లేశ్వరస్వామి ఆలయం నుంచి నగరోత్సవం ప్రారంభమవుతుంది . అక్టోబరు 5 విజయదశమి రోజు మాత్రం సాయంత్రం 4 గంటలకే నగరోత్సవం ఉంటుంది. అమ్మవారి ఆలయంలో దసరా పది రోజులూ ప్రత్యేక పూజలు ఉంటాయి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు , ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు రెండు విభాగాల్లో పూజలు నిర్వహిస్తారు.

తొలి పూజ చేయనున్న గవర్నర్​ దంపతులు : రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ దంపతులు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిని దర్శించుకుని తొలి పూజలు చేయనున్నారు. ఉత్సవాల్లో రోజుకు 60 వేల మంది వరకు భక్తులు రావొచ్చని.. అక్టోబర్​ రెండో తేదీ అమ్మవారి జన్మనక్షత్రం అయిన మూలానక్షత్రం రోజున రెండు లక్షల మందికిపైగా వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

వరద తీవ్రత దృష్ట్యా కృష్టా నదిలో స్నానాలు నిలిపివేత :రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సూచనల మేరకు ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరు ఢిల్లీరావు, నగర పోలీసు కమిషనర్‌ కాంతిరాణా, దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఈవో భ్రమరాంబ, సుమారు పది శాఖల అధికారుల ప్రత్యక్షంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కృష్ణానదిలో వరద తీవ్రతను దృష్టిలో ఉంచుకుని నది స్నానాలను పూర్తిగా నిషేదించి.. ఘాట్ల వద్ద జల్లు స్నానాలు ఏర్పాటు చేశారు.

20 లక్షల లడ్డు ప్రసాదాలు:వినాయక గుడి నుంచి టోల్‌గేటు ద్వారా ఓం మలుపు వరకు మూడు వరసలు, ఓం మలుపు వద్ద అదనంగా ఉచిత దర్శనానికి, వీఐపీలకు ఒక్కొక్క క్యూలైను చొప్పున మొత్తం ఐదు వరుసలు ఏర్పాటు చేశారు. భక్తులు తలనీలాలు సమర్పించేందుకు సీతమ్మవారి పాదాలు, పున్నమిఘాట్‌ వద్ద తాత్కాలికంగా షెడ్లు నిర్మించారు. భక్తుల కోసం సుమారు 20 లక్షల లడ్డు ప్రసాదాలను అందుబాటులో ఉంచుతున్నారు. దర్శనానికి వచ్చే భక్తుల కోసం సర్వదర్శనంతోపాటు వంద, మూడు వందల రూపాయల టిక్కెట్లను, వీఐపీలకు ఐదు వందల రూపాయల టిక్కెట్లను ఆన్‌లైన్‌లో.. అప్పటికప్పుడు అందించే ఏర్పాట్లు చేశారు.

400 సీసీ కెమెరాలతో నిఘా : కృష్ణానది వద్ద ముందస్తుగా గత ఈతగాళ్లను అందుబాటులో ఉంచుతున్నట్లు నగర పోలీసు కమిషనర్‌ కాంతారాణా వెల్లడించారు . సుమారు నాలుగు వేల మందితో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు.. 12 చోట్ల వాహనాలకు పార్కింగ్‌ ప్రదేశాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మోడల్‌ అతిథిగృహం వద్ద కమాండ్‌ కంట్రోల్‌రూం ఏర్పాటు చేశామని.. 400 సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు.

దసరా ఉత్సవాల ప్రారంభాన్ని పురస్కరించుకుని ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి సోమవారం తెల్లవారు జామున మూడు గంటలకు సుప్రభాత సేవ, ప్రాతఃకాల అర్చన, బాలబోగ నివేదన అనంతరం భక్తులకు అమ్మవారి దర్శన అవకాశం కల్పిస్తారు. చతుర్వేద పారాయణలు, మహావిద్య, సుందరకాండ, సప్తశతి, చండీనవాక్షరి, బాలమంత్రం, సూర్య నమస్కారాలు, లక్ష్మీగణపతి, శివపంచాక్షరీ, నవగ్రహ జపం, లలితా సహస్రనామ పారాణాయాలతో పాటు ప్రతిరోజు కుంకుమ పూజలు ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం గతానికి భిన్నంగా ఆలయ ప్రాంగణం మొత్తం దేదీప్యమానమైన విద్యుత్తుదీపాలంకరణ, లేజర్‌షోలను ఏర్పాటు చేశారు.

అమ్మవారి అలంకారాలు :శ్రీ దేవీ శరన్నవరాత్రులలో అమ్మవారికి చేసే అలంకారాలు, కట్టే చీర రంగు, నైవేద్యం వివరాలు..

  • 26-09-22 సోమవారం - పాడ్యమి - స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి - బంగారు రంగు చీర - కట్టెపొంగలి, చలిమిడి, వడపప్పు, పాయసం
  • 27-09-22 మంగళవారం - విదియ - శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి - లేత గులాబీ రంగు చీర - పులిహార.
  • 28-09-22 బుధవారం - తదియ - శ్రీ గాయత్రీ దేవి - కాషాయ లేదా నారింజ రంగు చీర - కొబ్బరి అన్నం , కొబ్బరి పాయసం
  • 29-09-22 గురువారం - చవితి - శ్రీ అన్నపూర్ణ దేవి - గంధపురంగు లేదా పసుపు రంగు చీర - దద్దోజనం, క్షీరాన్నం , అల్లం గారెలు
  • 30-09-22 శుక్రవారం - పంచమి - శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి - కుంకుమ ఎరుపు రంగు చీర - దద్దోజనం, క్షీరాన్నం
  • 01-10-22 శనివారం - షష్ఠి - శ్రీ మహాలక్ష్మీ దేవి - గులాబీ రంగు చీర - చక్కెర పొంగలి, క్షీరాన్నం
  • 02-10-22 ఆదివారం - సప్తమి - శ్రీ సరస్వతి దేవి - తెలుపు రంగు చీర - దద్దోజనం , కేసరి , పరమాన్నం
  • 03-10-22 సోమవారం - అష్టమి - శ్రీ దుర్గా దేవి - ఎరుపు రంగు చీర - కదంబం , శాకాన్నం
  • 04-10-22 మంగళవారం - నవమి - శ్రీ మహిషాసురమర్ధని దేవి - ముదురు ఎరుపు రంగు చీర - చక్కెర పొంగలి
  • 05-10-22 బుధవారం - దశమి - శ్రీ రాజరాజేశ్వరి దేవి - ఆకుపచ్చ రంగు చీర - లడ్డూలు, పులిహోర, బూరెలు, గారెలు, అన్నం
దసరా ఉత్సవాలకు సిద్ధమైన ఇంద్రకీలాద్రి.. నేడు స్వర్ణ కవచాలంకృత రూపం

ఇవీ చదవండి:

Last Updated : Sep 26, 2022, 6:54 AM IST

ABOUT THE AUTHOR

...view details