జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులకు సంబంధించిన కేసులో నిందితులు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, వి.విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్లతోపాటు అభియోగాల నమోదుపై సోమవారం వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్లపై సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి బి.ఆర్.మధుసూదన్‌రావు సోమవారం విచారణ చేపట్టారు. సీబీఐ ఆరోపణలను తోసిపుచ్చుతూ జగతి పబ్లికేషన్స్ తరఫు న్యాయవాది జి.అశోక్‌రెడ్డి వాదనలు వినిపించారు. జగతి పబ్లికేషన్స్ విలువను మదిస్తూ పెట్టుబడిదారులను మోసగించడానికి డెలాయిట్ నివేదికను పాత తేదీలతో రూపొందించారని, ఇది ఫోర్జరీ కింద వస్తుందని సీబీఐ కేసు నమోదు చేసిందన్నారు. అయితే పాత తేదీతో నివేదిక ఇచ్చింది డెలాయిట్‌కు చెందిన సుదర్శన్ అని, ఒకవేళ ఫోర్జరీ కేసు ఉంటే ఎవరు పత్రం రూపొందించారో వారిపైనే పెట్టాలన్న సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించారు. ఆదాయపు పన్నుశాఖ అధికారి ఇచ్చిన నివేదికను సవాలు చేశామని, ఆ నివేదికను పరిగణనలోకి తీసుకోరాదంటూ హైకోర్టు చెప్పిందన్నారు. అయినప్పటికీ క్వాసీ జ్యుడిషియల్ అధికారి అయిన ఐటీ అధికారి నుంచి వాంగ్మూలం తీసుకోవడం చెల్లదని పేర్కొన్నారు.
జగతి పబ్లికేషన్స్ పెట్టుబడులకు సంబంధించి ఇరుపక్షాల వాదనలు పూర్తికావడంతో న్యాయమూర్తి ఈ కేసును రాంకీ, వాన్‌పిక్ కేసులతో కలిపి విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు. భారతి సిమెంట్స్ కేసులో 4వ నిందితుడు, జగన్ సన్నిహితుడైన జెల్లా జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్‌పై విచారణ బుధవారానికి వాయిదాపడింది.