ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కార్గో డెలివరీలు పెంచేందుకు ఆర్టీసీ వింత నిర్ణయం !

కార్గో డెలివరీలు పెంచేందుకు ఆర్టీసీ తీసుకున్న వింత నిర్ణయం విమర్శలకు దారితీసింది. డోర్‌ డెలివరీ ప్రచార మాసోత్సవంలో భాగంగా ప్రతి ఆర్టీసీ ఉద్యోగీ తన బంధువులు, స్నేహితులతో నెలలో తప్పనిసరిగా మూడు పార్శిళ్లు గానీ, కొరియర్లు గానీ డోర్‌ డెలివరీతో సహా బుక్‌ చేయించాలని ఆదేశించారు. ఈ నిర్ణయంపై సంస్థ ఉద్యోగులు మండిపడుతున్నారు.

By

Published : Jul 31, 2022, 5:52 AM IST

కార్గో డెలివరీలు పెంచేందుకు ఆర్టీసీ వింత నిర్ణయం
కార్గో డెలివరీలు పెంచేందుకు ఆర్టీసీ వింత నిర్ణయం

ఏపీఎస్‌ఆర్టీసీలో కార్గో పార్శిల్స్‌, కొరియర్ల డోర్‌ డెలివరీ వ్యాపారాన్ని పెంచేందుకు ఆరంభించిన కార్యక్రమం విమర్శలకు తావిస్తోంది. డోర్‌ డెలివరీ ప్రచార మాసోత్సవంలో భాగంగా ప్రతి ఆర్టీసీ ఉద్యోగీ తన బంధువులు, స్నేహితులతో నెలలో తప్పనిసరిగా మూడు పార్శిళ్లు గానీ, కొరియర్లు గానీ డోర్‌ డెలివరీతో సహా బుక్‌ చేయించాలని ఆదేశించారు. దీనిపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ఏఎన్‌ఎల్‌ నుంచి లాజిస్టిక్‌ వ్యాపారాన్ని ఆర్టీసీ తీసుకొని 2017 నుంచి సొంతంగా నిర్వహిస్తోంది. దీని వల్ల ఏటా రాబడి పెరుగుతోంది. 2021-22లో రూ.122 కోట్లు వచ్చింది. ప్రస్తుత 2022-23లో రూ.250 కోట్ల రాబడి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. గతంలో బస్టాండ్‌ నుంచి బస్టాండ్‌ వరకే బుకింగ్‌ సదుపాయం ఉండగా, గత ఏడాది సెప్టెంబరు నుంచి డోర్‌ డెలివరీ సదుపాయం కూడా కల్పించారు. రాష్ట్రంలోని 84 బస్టాండ్ల పరిధిలోని 10 కి.మీ. దూరం వరకు 50 కేజీల బరువు మేర పార్శిళ్లు, కొరియర్లు డెలివరీ చేస్తున్నారు. ఇలా డోర్‌ డెలివరీ కావాలంటే అదనంగా డబ్బులు చెల్లించాలి. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 3 వేల డోర్‌ డెలివరీలతో కూడిన బుకింగ్స్‌ జరుగుతాయని అంచనా వేస్తే, సగటున 1,179 బుకింగ్సే జరుగుతున్నాయి. తాజాగా రోజుకు 5 వేల మేర బుకింగులు ఉండాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఇందుకోసం ఈనెల 25 నుంచి ఆగస్టు 24 వరకు డోర్‌ డోలివరీ ప్రచార మాసోత్సవం నిర్వహిస్తున్నారు.

బుకింగ్‌ చేసి తీరాల్సిందే! :ఆర్టీసీలో 50,145 మంది ఉద్యోగులు ఉండగా, ఒక్కొక్కరూ నెలలో మూడేసి చొప్పున డోర్‌ డెలివరీతో కూడిన పార్శిల్‌, కొరియర్లు బుక్‌ చేస్తే.. దాదాపు 1.50 లక్షలు బుకింగ్స్‌ అవుతాయని అధికారులు లెక్కలు వేశారు. ఇందుకు ప్రతి ఉద్యోగి తన స్నేహితులు, బంధువులు, తెలిసిన వారితో నెలలో మూడు కొరియర్లు బుక్‌ చేయించాలని లక్ష్యం నిర్దేశించారు. వెంటనే బుక్‌ చేయాలంటూ అన్ని డిపోల్లో అధికారులు ఒత్తిళ్లు చేస్తున్నారు.

ఈ ఒత్తిళ్లు భరించలేక కొందరు తమ బంధువులకు శ్రావణమాస శుభాకాంక్షలు, పెళ్లిరోజు, పుట్టిన రోజు శుభాకాంక్షలని పేపర్లతో రాసి, వాటిని కవర్లలో ఉంచి కొరియర్‌ బుక్‌ చేసి పంపుతున్నారు.

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details