APSRTC Extended Advance Reservation Deadline: ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్. దూర ప్రాంతాలకు నడిచే బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే గడువును 60రోజులకు ఏపీఎస్ఆర్టీసీ పొడిగించింది. ఈ మార్పులు రేపట్నుంచి అమలులోకి వస్తాయని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.
ఇప్పటివరకూ ప్రయాణానికి 30 రోజుల ముందు బస్సుల్లో సీట్లు రిజర్వేషన్ చేసుకునే సదుపాయం ఉండగా.. రేపట్నుంచి(గురువారం) ప్రయాణానికి 60 రోజుల ముందు సీట్లు రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కల్పించింది. క్రిస్మస్, సంక్రాంతి పండుగుల రద్దీ దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం రిజర్వేషన్ గడువు పెంచినట్లు ఆర్టీసీ తెలిపింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాలు.. సహా రాష్ట్రంలో పలు ప్రాంతాల మధ్య తిరిగే అన్ని దూర ప్రాంత బస్సుల్లో ఈ విధానం అమల్లోకి వస్తుందని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.