ఈ ఆవేదన ఒక్కరిద్దరిది కాదు.. వేల మందిది. కారుణ్య నియామకాల(Compassionate Appointments in apsrtc) కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచుస్తున్నారు. కాళ్లకు చెప్పులరిగేలా తిరుగుతున్నారు. ఉద్యోగం కోసం ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా కరుణించని పరిస్థితి నెలకొంది. వీరిలో ఆర్టీసీ సంస్థ కోసం ప్రాణత్యాగం చేసిన ఉద్యోగుల పిల్లలు కొందరైతే.. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులు మరికొందరు ఉన్నారు. ప్రయాణికుల కోసం ప్రాణాలు పణంగా పెట్టి అసువులు బాసిన ఉద్యోగుల వారసులూ ఉన్నారు. రోజులు.. వారాలు... నెలలు .. సంవత్సరాలు గడిచినా ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో రోడ్డెక్కారు. ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేస్తూనే ఉన్నారు. కానీ వీరి ఆవేదన, ఆక్రందన పట్టించుకునే నాథుడే లేరు.
ఆర్టీసీ ఉద్యోగం అంటే అంత సులువు కాదు..
ఏపీఎస్ఆర్టీసీ(APSRTC)లో ఉద్యోగం చేయడమంటే అంత సులువేమీ కాదు. ఎన్నో ప్రయాసాలకోర్చి విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముడుతాయి. అధిక పని గంటలు విధులు నిర్వహించడం, ఒత్తిళ్లు కారణంగా గుండె, మూత్రపిండాలు, నరాలకు సంబంధించి సమస్యలు ఎక్కువగా వస్తాయి. అంతేకాకుండా రోడ్డు ప్రమాదాలతో ఉద్యోగులు అర్థాంతరంగా ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో వారి కుటుంబాలు రోడ్డుపాలవుతున్నాయి.
నష్టాల సాకుతో నిలిపివేత..
సంస్థలో సిబ్బంది ఎవరైనా చనిపోతే వెంటనే కుటుంబంలో అర్హత ఉన్నవారికి ఉద్యోగం ఇవ్వాలనే నిబంధన ఉంది. ఎప్పటి కప్పుడు నిరంతరం కారుణ్య నియామకాలను చేపట్టి బాధితులకు అండగా నిలబడాలి. ఆర్టీసీ (artc)లో మాత్రం అలా జరగడం లేదు. నష్టాలు, కరోనా పేరు చెబుతూ 2016 నుంచి కారుణ్య నియామకాలు(Compassionate Appointments in apsrtc) చేపట్టకుండా నిలిపివేసింది. మానవతా దృక్పథంతో వెంటనే తమను ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు.