ఏపీపీఎస్సీ తీరుపై అభ్యర్థుల ఆందోళన
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ తీరుపై అభ్యర్ధులు ఆందోళన చెందుతున్నారు. గ్రూపు-1 ప్రిలిమ్స్ వాయిదా విషయంలో నిరుద్యోగుల మనోగతాన్ని... విలువైన సమయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా మౌనంగా ఉండడంపై కలవరపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ నాన్చుడి ధోరణిపై అభ్యర్ధులు ఆందోళన చెందుతున్నారు. గ్రూపు-1 ప్రిలిమ్స్ వాయిదా విషయంలో నిరుద్యోగుల మనోగతాన్ని... విలువైన సమయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా మౌనంగా ఉండడంపై కలవరపడుతున్నారు. మూడువారాల పాటు గ్రూపు-1 ప్రిలిమ్స్ వాయిదా వేస్తామని APPSC చెబుతున్నా... అంతకంటే ఎక్కువ సమయం అవసరమని అభ్యర్ధులు విజ్ఞప్తి చేస్తున్నారు. మార్చి 10వ తేదీన ప్రిలిమ్స్ నిర్వహిస్తే తాము తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
సిలబస్‌పై పట్టు సాధించేందుకు నాలుగైదు నెలలు పడుతుందని అభ్యర్థలు వాపోతున్నారు. కనీసం మూడు, నాలుగు సార్లు రివిజన్ చేయందే రాణించడం కష్టమంటున్నారు. పోలీసు, రెవెన్యూ, ఉపాధ్యాయులు, ఇతర శాఖల్లోని ఉద్యోగుల్లో పలువురు గ్రూపు-1 రాసేందుకు దరఖాస్తు చేశారు. ఎన్నికల హడావుడి సమీపిస్తున్నందున వీరికి సెలవులు దొరకడం కష్టం అవుతుందంటున్నారు. ఇంకొందరు ప్రిలిమ్స్ నిర్వహణ తేదీలపై స్పష్టత వస్తే సెలవులు తీసుకుని నగరాల్లో ప్రత్యేక శిక్షణ తీసుకోవాలని వేచి చూస్తున్నారు. వయోపరిమితిని 42 నుంచి 44 సంవత్సరాలకు పెంచాలని కొందరు అభ్యర్ధులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గ్రూపు-1, గ్రూపు-2 ఇతర ఉద్యోగాల దరఖాస్తుల స్వీకరణ గడువు త్వరలో ముగుస్తున్నందున వెంటనే వయోపరిమితి పెంపుపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మరికొన్ని ఉద్యోగ ప్రకటనలు వెలువడాల్సి ఉంది. జనవరి నెలాఖరు నాటికి ఈ ప్రకటనలు జారీ చేస్తామని కమిషన్ ప్రకటించింది. జనవరి 31వ తేదీ ముగిసినా... ఉద్యోగ ప్రకటనలు రాకపోవడం వల్ల అభ్యర్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో నోటిఫికేషన్లు రాకుంటే తమ విలువైన సమయం వృథా అవుతుందని వాపోతున్నారు. అయితే ఆయా శాఖల నుంచి వివరాలు రానందువల్లే నోటిఫికేషన్లు ఇవ్వలేకపోతున్నామన్నది కమిషన్ వర్గాల మాట.