ఉద్యోగ సంఘాల విజ్ఞప్తుల స్వీకరణ కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విజ్ఞప్తుల స్వీకరణ కోసం నోడల్ అధికారిగా ఆర్థికశాఖ అదనపు కార్యదర్శి ఆదినారాయణను నియమించింది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో నిర్ణయం మేరకు నోడల్ అధికారిని నియమిస్తున్నట్లు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఉత్తర్వులు జారీ చేశారు.
పీఆర్సీ నివేదిక విడుదల చేయాలి..
పీఆర్సీ నివేదిక(PRC report) ఇచ్చేందుకు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందంటే తమకు అనుమానాలు వస్తున్నాయని ఏపీజేఏసీ ఛైర్మన్ బొప్పరాజు(APJAC chirman bopparaju venkateshwarlu) వెంకటేశ్వర్లు అన్నారు. పీఆర్సీ నివేదికను ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతుందో తమకు అర్థం కావడం లేదని ఏపీజేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు(APJAC president bandi srinivasarao) తెలిపారు. వెంటనే నివేదికను విడుదల చేయాలని, తమ డిమాండ్లు అందులో ఉన్నాయో లేదో తెలుసుకోవాల్సిన అవసరం తమకు ఉందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పీఆర్సీని వెంటనే అమలు చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందో లేదో తెలపాలని డిమాండ్ చేశారు. రేపటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం(joint staff council meeting)లో పీఆర్సీ గురించే ప్రధానంగా ప్రస్తావిస్తామని వెల్లడించారు. వెంకట్రామిరెడ్డి కూడా ఉద్యోగుల కోసమే కృషి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తామంతా ఏకమై ఉద్యమిస్తుంటే...ప్రభుత్వం ఓర్వలేక పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోమని స్పష్టం చేశారు.
జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్‌తో(GAD principle secretary shashibhushan) జరిగిన ఉద్యోగ సంఘాల ప్రతినిధుల సమావేశంలో.. వెంటనే పీఆర్సీ నివేదికను బయటపెట్టాలని కోరినట్లు ఏపీజేఏసీ నేతలు వివరించారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని(joint staff council) సభ్యసంఘాల వివరాలనూ కోరినట్లు వెల్లడించారు. సీఎంఓ అధికారులతో పీఆర్సీ నివేదికపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని, పీఆర్సీ నివేదికను ఇప్పుడే ఇవ్వలేమని శశిభూషణ్ చెప్పినట్లు బొప్పరాజు, బండి శ్రీనివాస్ చెప్పారు.
పీఆర్సీ నివేదికను ఎందుకు దాస్తున్నారో తెలియట్లేదు. మా డిమాండ్లను 11వ పీఆర్సీలో నివేదించాం. మా డిమాండ్లను పీఆర్సీ కమిటీ నివేదించిందో లేదో తెలియదు. పీఆర్సీ నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదు. మా నివేదిక కాపీని మాకు ఇవ్వాలని కోరుతున్నాం. - బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీజేఏసీ ఛైర్మన్
సచివాలయం వేదికగా ఆందోళన...
వేతన సవరణ కమిషన్ (పీఆర్‌సీ) నివేదిక కోసం సచివాలయం వేదికగా ఉద్యోగసంఘాల నేతలు బుధవారం నిరసనకు(APJAC leaders protst at secretariat) దిగారు. ఏపీ ఐకాస ఛైర్మన్ బండి శ్రీనివాసరావు, ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, మరికొందరు నేతలు.. ఐదున్నర గంటలపాటు పట్టువీడలేదు. బుధవారం మధ్యాహ్నం 4గంటలకు సచివాలయానికి వచ్చిన నేతలు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ(CS sameer sharma)ను కలిశారు. దీనిపై చర్చించేందుకు సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్తున్నానని, వేచి ఉండాలని సీఎస్ చెప్పారంటూ.. నేతలు రెండో బ్లాకు ముందు ఎదురుచూశారు. చీకటి పడినా స్పందన రాలేదు. దీంతో నివేదిక ఇచ్చేవరకూ కదలబోమని భీష్మించారు. రాత్రి 9.30 వరకూ ఉన్నారు. అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. సచివాలయ భద్రతా సిబ్బంది ఒత్తిడితో అక్కడి నుంచి వెళ్లిపోయారు. సీఎంతో మాట్లాడి బుధవారం పీఆర్‌సీ నివేదిక ఇస్తామని సీఎస్ హామీ ఇచ్చారని, అందుకే తాము ఎదురు చూశామని బండి శ్రీనివాసరావు(bandi srinivasarao), బొప్పరాజు వెంకటేశ్వర్లు(bopparaju venkateshwarlu) తెలిపారు. ఐదున్నర గంటలపాటు తమ సహనాన్ని పరీక్షించారని, తమను చిన్నచూపు చూస్తున్నట్లు భావిస్తున్నామని మండిపడ్డారు. పీఆర్‌సీ నివేదికను ఎందుకు దాచిపెడుతున్నారో అర్థం కావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను ఇబ్బందులకు గురిచేసిన అధికారులపై ఏం చర్యలు తీసుకోవాలో ప్రభుత్వమే ఆలోచించాలన్నారు. రెండు ఐకాసల్లోని సంఘాలతో గురువారం సమావేశమై కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
ఇదీ చదవండి:పీఆర్సీ నివేదిక బహిర్గతం చేయకుండా అభిప్రాయాలు చెప్పలేం: వెంకట్రామిరెడ్డి