APIIC WebPortal: ఏపీఐఐసీలో 14 సేవల్ని ఆన్‌లైన్ ద్వారా అందించనున్నట్టు పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఏపీఐఐసీ అధికారిక వెబ్సైట్ను ఆయన ప్రారంభించారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఇబ్బంది లేకుండా సింగిల్ విండో ద్వారా పూర్తి సేవలు అందించేందుకు ఈ ఆన్‌లైన్ సేవలు ఉపకరిస్తాయన్నారు.
పారిశ్రామికవేత్తల ఫైళ్లను ఎప్పటికప్పుడూ ట్రాక్ చేసి చూసుకునే విధానం అమల్లోకి రానున్నట్టు తెలిపారు. ఆన్‌లైన్ ద్వారానే దరఖాస్తు నుంచి కేటాయింపులు, అనుమతులు అందుతాయని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు ఫైళ్ల స్టేటస్ తెలుసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో పరిశ్రమల శాఖపై మరింత బాధ్యత పెరిగిందని కరికాల వలవన్ స్పష్టం చేశారు.