ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ విద్యుత్తు బాకీలపై కోర్టుకెక్కిన ఏపీ - APGENCO PETITION OVER TELANGANA

APGENCO PETITION
APGENCO PETITION

By

Published : Sep 13, 2021, 9:19 PM IST

Updated : Sep 14, 2021, 4:22 AM IST

21:15 September 13

APGENCO PETITION OVER TELANGANA

   తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్తు బకాయిల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తాము విద్యుత్తు సరఫరా చేసినందుకుగాను రూ. 6,283.68 కోట్ల బకాయిలను తెలంగాణ ప్రభుత్వం చెల్లించడంలేదంటూ.. ఏపీ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. 2014 జూన్‌ నుంచి 2017 జూన్‌ వరకు తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థల నుంచి రావలసిన రూ. 3,441.78 కోట్ల అసలు, దానిపై ఈ ఏడాది ఆగస్టు వరకు వడ్డీ, తదితరాలు కలిపి రూ. 2,841.90 కోట్ల మేర రావలసి ఉందని, వాటిని చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ ఏపీ జెన్‌కో ఎండీ బి.శ్రీధర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఏపీ తరఫున అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం వాదనలను వినిపిస్తూ.. ఈ వివాదం గత మూడేళ్లుగా జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌లో నడుస్తోందని, అక్కడ పిటిషన్‌ను ఉపసంహరించుకుని హైకోర్టును ఆశ్రయించామని తెలిపారు. ఇందులో ప్రతివాదులుగా చేర్చిన తెలంగాణ విద్యుత్తు శాఖ, టీఎస్పీడీసీఎల్‌, టీఎన్‌పీడీసీఎల్‌ల తరఫున అడ్వకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌, తెలంగాణ విద్యుత్తు సమన్వయ కమిటీ తరఫు న్యాయవాది వై.రామారావు నోటీసులు తీసుకున్నారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను అక్టోబరు 28కి ధర్మాసనం వాయిదా వేసింది.

ఏపీ జెన్‌కో చెప్పిన వివరాలివి..

‘‘రాష్ట్ర విభజన అనంతరం బొగ్గు, ఆయిల్‌, సహజ వాయువు, విద్యుత్తు ఉత్పత్తి, సరఫరా, పంపిణీ తదితర అంశాలన్నీ విభజన చట్టంలోని 12వ షెడ్యూల్‌ పరిధిలోకి చేరాయి. 2009, 2010ల్లో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఏపీ జెన్‌కో తెలంగాణకు విద్యుత్తు సరఫరా చేస్తున్నా చెల్లింపులు మాత్రం జరగడంలేదు. బకాయిల కోసం పలుమార్లు అడిగినా, లేఖలు రాసినా లాభంలేకపోయింది. 2015లో అప్పటికి ఉన్న బకాయి రూ. 3,074.51 కోట్లు చెల్లించాలని లేఖ రాశాం. ఇదే విషయాన్ని తెలంగాణ విద్యుత్తు సమన్వయ కమిటీ దృష్టికి కూడా తీసుకెళ్లాం. అయితే ఏపీ విద్యుత్తు పంపిణీ సంస్థల నుంచే తమ జెన్‌కోకు రావలసిన బకాయిలు ఉన్నాయని తెలంగాణ చెప్పింది. వాటిని సర్దుబాటు చేసినప్పటికీ 2014 నుంచి 2015 దాకా రూ. 1,033 కోట్లు రావలసి ఉంది. 2015లో రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల మధ్య సమావేశం జరిగింది. నెలకు రూ. 150 కోట్ల చొప్పున డిస్కంలు చెల్లించడానికి అంగీకారం కుదిరింది. అయితే దానికీ తెలంగాణ ప్రభుత్వం కట్టుబడలేదు. ఏపీ డిస్కంల నుంచే తెలంగాణ జెన్‌కోకు రావాల్సి ఉందని మరోసారి పేర్కొంది. డిస్కంల తాలూకు బకాయిలను ప్రభుత్వం నుంచి రాబట్టుకోవచ్చు. వాటిని జెన్‌కోకు ముడిపెట్టడం సరికాదు" అని ఏపీ జెన్‌కో పేర్కొంది.

రుణాలు కట్టలేకపోతున్నాం..

"వివిధ ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించకపోవడంతో మా క్రెడిట్‌ రేటింగ్‌ దెబ్బతింటోంది. పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, కేంద్ర రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌లకు రూ. 807.57 కోట్లు చెల్లించకపోవడంతో అవి నిరర్థక రుణాలుగా ప్రకటించాయి. అతి కష్టం మీద రుణాలను చెల్లించాం. బొగ్గు సరఫరాదారులకు చెల్లింపులు చేయని పక్షంలో విద్యుదుత్పత్తికి తీవ్ర ఇబ్బందులు తప్పవు.  ఇక్కడ ఉత్పత్తి ఆగిపోయినందున ఏపీ పంపిణీ సంస్థలు ఎక్కువ ధర చెల్లించి విద్యుత్తు కొనాల్సి వస్తోంది. ఉద్యోగులకు జీతాల కింద రూ. 900 కోట్లు, ఏడాదికి పెన్షన్ల కింద రూ. 1,200 కోట్లు భరించాల్సి వస్తోంది. అందువల్ల మాకు రావలసిన రూ. 6,283 కోట్లు వెంటనే చెల్లించేలా ఆదేశాలివ్వండి. మాకు బకాయి ఉందంటూ గతంలో అంగీకరించిన రూ. 3,441 కోట్లను తక్షణం చెల్లించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వండి’’ అని ఏపీ జెన్‌కో తెలంగాణ హైకోర్టును కోరింది.

ఇదీ చదవండి: 

కోర్టు కేసులపై 'మనుపాత్ర' పేరుతో ప్రత్యేక యాప్: రజత్ భార్గవ

Last Updated : Sep 14, 2021, 4:22 AM IST

ABOUT THE AUTHOR

...view details